వ్యాపారిని చంపి పూడ్చిపెట్టారు.. 7 రోజుల తర్వాత ట్విస్ట్!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

షాద్‌నగర్: షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన వ్యాపారి హత్య కేసును పోలీసులు కేవలం వారం రోజుల్లో ఛేదించారు. అదృశ్యమైన వ్యాపారవేత్త మహ్మద్ హాజీని భూవ్యాపార లావాదేవీలు, ఆర్థిక విభేదాల కారణంగా హత్య చేసి మృతదేహాన్ని ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు షాద్‌నగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఎసిపి) లక్ష్మీనారాయణ వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన మహ్మద్ హాజీ (35) ఈ నెల 22న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణతో దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో బిజినపల్లికి చెందిన పానుగంటి అరవింద్ జీ (36), వీరకారి శివాజీ (35)లపై అనుమానం వ్యక్తమైంది. విచారణలో ఇద్దరూ భూవ్యాపార లావాదేవీలు, డబ్బు వివాదాల నేపథ్యంలో మహ్మద్ హాజీని కారులో తీసుకెళ్లి హత్య చేసినట్లు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం మృతదేహాన్ని షాద్‌నగర్ సమీపంలోని ట్రూ ల్యాండ్‌మార్క్–9ఈఎక్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలోని ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. నిందితులు చూపించిన ప్రదేశంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఉపయోగించిన కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 29న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది.

కేసును వేగంగా ఛేదించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసు బృందాన్ని షాద్‌నగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభినందించినట్లు ఎసిపి లక్ష్మీనారాయణ తెలిపారు.