కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
పశ్చిమగోదావరి: సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు కాలువలో మునిగి మృతి చెందిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పాలకోడేరు మండలం వేండ్రలోని గోస్తని–వేల్పూరు కాలువలో ఈ ప్రమాదం జరిగింది. మరో విద్యార్థి మునిగిపోతుండగా స్నేహితులు కాపాడి ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం సరదాగా స్నానం చేసేందుకు వేండ్రలోని కాలువ వద్దకు వెళ్లారు. వంతెన సమీపంలో ఇద్దరు విద్యార్థులు కాలువలోకి దిగడంతో నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.
వారిని రక్షించేందుకు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఎస్.సాయి కూడా కాలువలోకి దూకాడు. అయితే అతను కూడా నీటిలో మునిగిపోతుండగా.. మిగిలిన ముగ్గురు స్నేహితులు కర్ర సాయంతో అతడిని ఒడ్డుకు లాగి కాపాడారు. అనంతరం సాయిని భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాలువలో గల్లంతైన భీమవరం గునుపూడికి చెందిన పెరుమళ్ల సత్య భాస్కర విఘ్నేష్ (21), విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఎస్.రాహుల్ (21) కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదే కాలువలో ఇటీవల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కాలువ వద్ద వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.