గర్భస్థ శిశువుకు గర్భంలోనే రక్తమార్పిడి.. గుంటూరులో అరుదైన చికిత్స

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు: సాధారణంగా రక్తహీనతతో బాధపడే వారికి రక్తమార్పిడి చేయడం సర్వసాధారణం. అయితే గర్భస్థ శిశువు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు తల్లి గర్భంలోనే రక్తమార్పిడి చేయడం అత్యంత సున్నితమైన వైద్య ప్రక్రియ. గుంటూరులోని డాక్టర్ అర్చన ఫీటల్ మెడిసిన్ సెంటర్‌లో ఇలాంటి అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

గుంటూరు వారితోట 5వ లైన్‌లోని డాక్టర్ అర్చన ఫీటల్ మెడిసిన్ సెంటర్‌లో మంగళవారం డాక్టర్ జి. అర్చన ఈ వివరాలను వెల్లడించారు. 28 ఏళ్ల మహిళ 30 వారాల గర్భంతో వైద్య పరీక్షల కోసం సెంటర్‌కు వచ్చారు. గర్భస్థ శిశువు ఎదుగుదలను పరిశీలించేందుకు నిర్వహించిన స్కానింగ్‌లో శిశువు పెరుగుదల సాధారణంగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే శిశువులో రక్తప్రసరణలో అసాధారణత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

తదుపరి నిర్వహించిన ఇన్‌డైరెక్ట్ కూంబ్స్ టెస్ట్‌లో పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో గర్భస్థ శిశువు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అనుమానించారు. అనంతరం నిర్వహించిన ఇంట్రాయుటెరైన్ ఫీటల్ బ్లడ్ శాంప్లింగ్‌లో శిశువు హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 4.6 గ్రాములుగా నమోదైంది.

శిశువు తీవ్ర రక్తహీనతతో ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం, తల్లి గర్భంలోనే శిశువుకు ఇంట్రాయుటెరైన్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (IUT) నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. అత్యంత జాగ్రత్తతో నిర్వహించిన ఈ ప్రక్రియను డాక్టర్ అర్చన విజయవంతంగా పూర్తి చేశారు.

గర్భస్థ శిశువుకు గర్భంలోనే రక్తమార్పిడి చేయడం అత్యంత సున్నితమైన ఫీటల్ మెడిసిన్ చికిత్సల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. చికిత్స అనంతరం తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గుంటూరులో ఇలాంటి అరుదైన ఫీటల్ మెడిసిన్ చికిత్స విజయవంతం కావడంపై వైద్య వర్గాలు అభినందనలు తెలిపాయి.