కృష్ణానదిపై ఫిట్నెస్ లేని పడవల దందా-ప్రాణాలతో చెలగాటం!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అచ్చంపేట (పల్నాడు), జూన్ 28: కృష్ణానదిపై నిత్యం వందలాది మంది ప్రయాణించే పడవలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అవసరమైన అనుమతులు లేకుండానే నడుస్తుండటంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిట్నెస్ లేకపోవడంతో అధికారులు పడవలను సీజ్ చేసినప్పటికీ, అదే పడవలు తిరిగి ప్రయాణికులను తరలిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గింజుపల్లి, కోగంటివారి పాలెం ప్రాంతాల్లో ఫిట్నెస్ లేని పడవలు నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే ప్రయాణం కొనసాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

9 చోట్ల పడవ టెండర్లు వాయిదా

ప్రతి ఏడాది గుంటూరు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవల నిర్వహణకు టెండర్లు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన విధించడంతో జిల్లాలోని తొమ్మిది ప్రాంతాల్లో ఒక్క పడవకూ ఫిట్నెస్ లేకపోవడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. అమరావతి మండలం దిడుగు గ్రామం నుంచి నడిచే ఒక పడవకు మాత్రమే అన్ని అనుమతులు ఉండటంతో టెండర్ పూర్తయింది.

ప్రభుత్వానికి లక్షల ఆదాయం కోల్పోతున్న పరిస్థితి

ఒక్కో పడవ కేంద్రం ద్వారా రోజుకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. నిర్వహణ ఖర్చులు మినహాయించినా రోజుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం మిగులుతుందని పేర్కొంటున్నారు. టెండర్లు లేకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన లక్షల రూపాయల ఆదాయం దెబ్బతింటోందని, దళారీ వ్యవస్థ లాభపడుతోందని ఆరోపిస్తున్నారు.

పంచాయతీల ఆధ్వర్యంలో పడవలు నడపాలని డిమాండ్

కొత్త పడవలకు మాత్రమే త్వరగా ఫిట్నెస్ లభిస్తుందని, పాత పడవలకు ఫిట్నెస్ పొందడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఫిట్నెస్ పడవలు అందుబాటులోకి వచ్చే వరకు స్థానిక గ్రామపంచాయతీలు, సచివాలయ అధికారులు, ఎంపీడీవోల పర్యవేక్షణలో తాత్కాలికంగా పడవలను నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో ప్రయాణికుల భద్రతతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా కాపాడవచ్చని, గ్రామపంచాయతీల నిధులు పెరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

దళారీలకు అవకాశం ఇవ్వొద్దు: ప్రజల విజ్ఞప్తి

ప్రస్తుతం అనుమతులు లేకుండానే కొందరు పడవలను నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా నడుస్తున్న పడవలపై చర్యలు తీసుకోవాలని, ఫిట్నెస్ లేని పడవలను పూర్తిగా నిలిపివేయాలని, పంచాయతీల ఆధ్వర్యంలో తాత్కాలిక నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.