అమరావతి ప్రపంచ స్థాయి వైద్య కేంద్రంగా మారుతుంది.. లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని రాబోయే కాలంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధి, హెల్త్ టూరిజం అవకాశాలు, ప్రజల ఆరోగ్య పరిరక్షణపై విస్తృతంగా మాట్లాడారు.

దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన లలితా గ్రూప్ గుంటూరులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో 600 పడకల సామర్థ్యంతో, 32 ప్రత్యేక వైద్య విభాగాలతో కూడిన అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి అత్యాధునిక వైద్య సేవలను ఒకే చోట అందించే కేంద్రంగా ఈ ఆసుపత్రి నిలవబోతోందన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావనలో మాట్లాడుతూ, 1995లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రులు మాత్రమే ఉన్న సమయంలో హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించామని గుర్తు చేశారు. ఆ కృషి ఫలితంగా నేడు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా రోగులు హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందుతున్నారని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా అంతర్జాతీయ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స అందించిన లలితా హాస్పిటల్ ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించిందని ఆయన కొనియాడారు. ఒక సంస్థ లేదా వ్యవస్థ విజయవంతం కావాలంటే ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, విలువలు ఉండాలని చెప్పారు. బ్రాండ్‌ను స్థాపిస్తే దానికి తిరుగుండదని, లలితా హాస్పిటల్ అందుకు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఆరోగ్యమే మనిషి జీవితంలో అత్యంత విలువైన ఆస్తి అని సీఎం స్పష్టం చేశారు. “వేల కోట్ల రూపాయల సంపద, భారీ భవనాలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి అర్థం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తే నిజమైన ధనవంతుడు” అని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధికి ఆరోగ్యవంతమైన పౌరులు అవసరమని, “హెల్తీ సిటిజన్స్‌నే వెల్తీ నేషన్‌ను నిర్మిస్తారు” అని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఇది కేవలం ఆరోగ్య పథకం మాత్రమే కాదని, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమని వివరించారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, ఇంటి వద్దనే 42 రకాల వైద్య పరీక్షలు, అవసరమైన మందులపై సూచనలు, వైద్య సలహాలు అందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ముందుగానే కాపాడే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలని సూచించారు.

మంచి ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం, యోగా, ప్రాణాయామం ఆరోగ్యానికి ఎంతో అవసరమని చంద్రబాబు చెప్పారు. “ఫుడ్ ఈజ్ మెడిసిన్.. కిచెన్ ఈజ్ ఫార్మసీ” అనే భావనను ప్రతి కుటుంబం ఆచరించాలని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయంలో అధికంగా ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని ఆరోపించిన సీఎం, ప్రజల ఆరోగ్యంతో ఎవరూ చెలగాటమాడకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, లలితా హాస్పిటల్ భవిష్యత్తులో రాష్ట్ర ఆరోగ్య రంగానికి ఒక ల్యాండ్‌మార్క్ ఇన్‌స్టిట్యూట్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.