సీఎస్ సాయి ప్రసాద్‌కు మరో 6 నెలల పొడిగింపు.. 2027 మే 31 వరకు కొనసాగింపు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, అక్టోబరు 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి. సాయి ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. దీంతో ఆయన 2027 మే 31వ తేదీ వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాయి ప్రసాద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అండర్‌ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.

ఇప్పటికే ఒకసారి పొడిగింపు

1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జి. సాయి ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీకాలాన్ని గతంలో జూన్ 1 నుంచి నవంబరు 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ నేపథ్యంలో నవంబరు 30తో ఆయన పదవీకాలం ముగియాల్సి ఉంది.

అయితే, సాయి ప్రసాద్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 29న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆమోదించిన కేంద్రం.. ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో సాయి ప్రసాద్ 2027 మే 31 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.