మంగళగిరిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత!
గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్ చేరిక.. 25 కుటుంబాలతో కలిసి పసుపు కండువా కప్పుకున్న నేత
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 25 కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకాంత్‌తో పాటు పార్టీలో చేరిన వారికి లోకేశ్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఆసుపత్రి నిర్మాణంతో పాటు కమ్యూనిటీ భవనాలు, పార్కులు, అంగన్‌వాడీ భవనాలు, గ్రంథాలయాలు, శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
గతంలో ఎన్నడూ జరగని రీతిలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 2024 ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో కూటమికి మరింత మెజారిటీ సాధించేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
ఎన్డీయే కూటమి ఐక్యంగా ఉంటేనే ఆశించిన అభివృద్ధిని సాధించగలమని లోకేశ్ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎదుర్కొందామని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గతంలో పదేళ్లపాటు ఒకరికి అవకాశం ఇచ్చారని, తనకు రెండున్నరేళ్ల సమయం ఇచ్చారని పేర్కొన్న మంత్రి.. ఆయా కాలాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిలువూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోటకూర సీతారామయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకుడు ముమ్మిడి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ యాళ్ల జయలక్ష్మి, టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జి చిలువూరి ఏసుపాదం, దుగ్గిరాల మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పినపాటి కరుణాకర్, యూనిట్ ఇన్‌ఛార్జి చిలువూరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.