ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్‌!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

నామినేషన్లపై నిర్ణయం తీసుకునే వరకు 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిలిపివేత

అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (రిటైర్డ్‌) బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్ 14న నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు వివరించారు.

25 వరకు తుది జాబితా ప్రచురణ వాయిదా

నామినేషన్ల దాఖలుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అక్టోబర్ 21న కీలక ఆదేశాలు ఇచ్చింది. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వాటికి సంబంధించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పరిశీలించి గడువు పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది.

రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలి

నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థుల విషయంలో గడువు పొడిగింపుపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గడువు పొడిగించాలని నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి కనీసం 48 గంటల పాటు అదనపు గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంది.

కలెక్టర్లు, పోలీసు అధికారుల నివేదికల తర్వాత తదుపరి చర్యలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీల నుంచి నివేదికలు అందుకున్న తర్వాత అక్టోబర్ 22న తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.