బీటెక్ విద్యార్థుల గంజాయి దందా!
పల్నాడు జిల్లా, నరసరావుపేట: నరసరావుపేటలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ దాడి నిర్వహించి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ తెలిపారు.
ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గంజాయి విక్రయాలు
పోలీసుల వివరాల ప్రకారం, మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థి సింహాచలం అలియాస్ వినోద్ గంజాయిని తీసుకొచ్చి, కృష్ణా జిల్లాకు చెందిన మరో బీటెక్ విద్యార్థి సాయినాథ్కు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన జావేద్, రహంతుల్లా, అతావుల్లాలతో పరిచయం ఏర్పడి, వారు కూడా అతని వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ముందస్తు సమాచారంతో దాడి
ప్రకాశ్‌నగర్‌లోని అంధుల ఉన్నత పాఠశాల సమీపంలో గంజాయి కొనుగోలు కోసం వచ్చిన నిందితులపై ముందస్తు సమాచారంతో వన్‌టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. వారి వద్ద నుంచి సుమారు 1,400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు
అరెస్టు చేసిన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ ఫిరోజ్ వెల్లడించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.