వృద్ధాప్యాన్ని జయించాలా? ఈ మార్పులు చాలు!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి కీలక సూచనలు

గుంటూరు: జీవనశైలిలో సరైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, సాయి భాస్కర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన సభలో ఆయన "వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేయడం ఎలా – ఆర్థోపెడిక్ సమస్యలు" అనే అంశంపై ప్రసంగించారు.

పాజిటివ్ ఆలోచనే ఆరోగ్యానికి మూలం

వృద్ధాప్యం అనేది జీవితంలో సహజమైన దశ మాత్రమేనని, దాన్ని భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆశావహ దృక్పథం, సానుకూల ఆలోచన, క్రమబద్ధమైన జీవనశైలి ఉంటే 80, 90 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జీవించవచ్చని పేర్కొన్నారు. వృద్ధాప్య లక్షణాలు కనిపించగానే తాము పనికిరామని భావించడం సరైనది కాదన్నారు.

మోకాళ్ల నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు

వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో మోకాళ్ల కీళ్ల అరుగుదల ప్రధానమని ఆయన చెప్పారు. మోకాళ్ల నొప్పి తీవ్రంగా మారితే నడవడం, రోజువారీ పనులు చేయడం కూడా కష్టమవుతుందని హెచ్చరించారు. ఊబకాయం, జన్యుపరమైన కారణాలు కీళ్ల అరుగుదలకు ప్రధాన కారణాలని వివరించారు.

ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు

మోకాళ్ల సమస్య మొదటి రెండు దశల్లో గుర్తిస్తే మందులు, ఇంజెక్షన్లతోనే నియంత్రించవచ్చని తెలిపారు. అయితే మూడో లేదా నాలుగో దశకు చేరితే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం ఉందన్నారు.

కార్టిలేజ్ దెబ్బతింటే తిరిగి పెరగదు

మోకాళ్ల కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ దెబ్బతినడమే కీళ్ల అరుగుదలకు ప్రధాన కారణమని చెప్పారు. ఒకసారి కార్టిలేజ్ పూర్తిగా దెబ్బతింటే అది మళ్లీ సహజంగా ఏర్పడదని, గుజ్జు తిరిగి వస్తుందని ప్రచారం చేసే చికిత్సలపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.

రోబోటిక్ సర్జరీపై అపోహలు వద్దు

రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను రోబోలు స్వయంగా చేయవని, వైద్యుల పర్యవేక్షణలో అత్యంత కచ్చితత్వంతో నిర్వహించే ఆధునిక విధానమని డాక్టర్ నరేందర్ రెడ్డి వివరించారు. ఈ విధానం భవిష్యత్తులో మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఫిజియోథెరపీ కూడా కీలకం

కీళ్ల మార్పిడి అనంతరం ఫిజియోథెరపీ ఎంతో ముఖ్యమని, అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలతో గతంతో పోలిస్తే నొప్పి, ఫిజియోథెరపీ అవసరం గణనీయంగా తగ్గిందన్నారు.

10 వేలకుపైగా విజయవంతమైన కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు

దాదాపు 10 వేలకుపైగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డిని ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, అవగాహన సంస్థ ప్రతినిధులు ఘనంగా అభినందించారు.