వెలిగొండపై చంద్రబాబు కీలక ప్రకటన.. 31న ఏం జరగబోతోందంటే?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి: వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు తొలి దశను ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును అందించారు.

30 ఏళ్ల కలకు ముగింపు

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతోందని చంద్రబాబు తెలిపారు. 1996లో ప్రాజెక్టుకు శిలాఫలకం వేయగా.. 2026లో ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. 1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు రైతులు సాగు, తాగునీరు అందించాలని కోరారని గుర్తుచేశారు.

వారి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని, గత రెండేళ్లలోనే రూ.2,250 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపన చేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

ఎల్‌నినో ప్రభావం ఉన్నా..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు కూడా ఆశించిన స్థాయిలో నీరు రాలేదన్నారు. అయినప్పటికీ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగిందని చెప్పారు.

2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేవారమని చంద్రబాబు అన్నారు. గత పాలకుల హయాంలో ప్రాజెక్టు విషయంలో జరిగిన జాప్యం వల్ల నిర్మాణం ఆలస్యమైందని విమర్శించారు.

పోలవరం పూర్తయితే మరింత ప్రయోజనం

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు నీరు అందించడంతో పాటు.. శ్రీశైలం జలాలను పొదుపుగా వినియోగించి ప్రకాశం, నెల్లూరు, కడపతో పాటు రాయలసీమ ప్రాంతాలకు నీరు అందించే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు.

దేశంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నదుల అనుసంధానం అవసరమని చంద్రబాబు అన్నారు. గంగా-గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు చెప్పారు. ఐదు నదులను అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యలను పరిష్కరించవచ్చని, దేశానికి నీటి భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు.

నిర్వాసితులకు అండగా ప్రభుత్వం

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించిన చంద్రబాబు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

అభివృద్ధితో పాటు కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించి అండగా నిలవాలని చంద్రబాబు కోరారు.