ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నిజమే...!?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సర్వేలపై చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉండగానే..సర్వేల గోల మొదలైంది. ముందుగా వైకాపాకు అనుకూలంగా ఓ సర్వే రావడం, దానిపై రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదనలు జరగడం, అది ఫేక్ సర్వే అంటూ అధికార కూటమి కొట్టేయడంపై గత వారం రోజులుగా జరుగుతోంది. అయితే..ఇప్పుడా సర్వేకు వ్యతిరేకంగా భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆంగ్లపత్రిక ఇండియాటుడే సర్వే రావడం, దానిలో కూటమి ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పడంతో...వైకాపా, టిడిపి కూటమిలు ఎవిరికి వారు తమకు అనుకూలంగా ఉన్న సర్వేలే నిజమైనవని వాదిస్తున్నారు. వాస్తవానికి ఐఐటి హైదరాబాద్ సర్వే ఎవరు చేశారనేదానిపై స్పష్టత లేదు. అయితే..ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన సర్వేకు ప్రమాణికత ఉంది. అదేమీ కావాలని చేసే సర్వే కాదు. ఏడాదికి రెండు సార్లు ఆ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ సర్వేలు ఇస్తుంది. పైగా వివిధ ఎన్నికల సమయంలో వారు ఇచ్చే సర్వేలు దాదాపు నిజం అవుతుంటాయి. ఆ సంస్థ ఇచ్చే సర్వేలకు కొంత క్రెడిబులిటీ ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ కూటమే అధికారంలోకి వస్తుందనే భావన ఉంది. అయితే..ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. దీన్ని ఎవరూ ఎత్తిచూపడం లేదు.

24 నుంచి 20కి పడిపోయిన కూటమి...!

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..కూటమికి 20 పార్లమెంట్ సీట్లు, వైకాపాకు 5 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సర్వేలో పేర్కొన్నారు. వాస్తవానికి గత జనవరిలో ఈ సంస్థ సర్వే చేసినప్పుడు కూటమికి 24 సీట్లు, వైకాపాకు ఒక్క సీటు వస్తుందని పేర్కొంది. దాని ప్రకారం చూసుకుంటే ఈ ఏడు మాసాల్లో వైకాపా గొప్పగా పుంజుకున్నట్లే. అదే విధంగా వైకాపా ఓటు శాతం 39 నుంచి 41కి పెరగడం కూడా గమనించదగిన అంశమే. అయితే...ఈ ఫలితాలతో వైకాపా ఏమీ అధికారంలోకి రాలేదు. అయితే..ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కొద్ది మేర అసంతృప్తి ఉన్నదని ఈ సర్వే తెలియచేస్తోంది. ముఖ్యంగా స్వంత పార్టీ నుంచే కూటమికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికార కూటమిలో పెద్ద పార్టీ అయిన టిడిపి కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో, నాయకుల్లో ఉన్న అసంతృప్తి ఈ సర్వేల్లో బయటపడింది. పార్టీ కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారి అనుచరులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, రేపనేది లేదన్నట్లు వీరు వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి పార్టీ వర్గాల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది. జగన్ ఉన్నప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేదనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. అదీ కాక ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమపథకాలన్నీ వైకాపాను అభిమానించేవారికే దక్కుతున్నాయని, టిడిపి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఏమీ దక్కడం లేదనే ఆక్రోశం వారిలో ఉంది. అదే విధంగా అధికారుల పాలనే జరుగుతుందని, పార్టీని పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలానే అధికారులతోనే అంతా నడిపిస్తున్నారనే భావనతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్లలా చేసుకుని ముందుకు వెళుతున్నా..సత్వర ఫలితాలను వారు ఆశిస్తున్నారు. సత్వర ఫలితాలు రాకపోవడంతో..వారు ప్రభుత్వ పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వర్షాభావంతో రైతుల ఆందోళన...!

ఇవన్నీ ఒక ఎత్తు అయితే..ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా రాష్ట్రమంతా కరువు ఛాయలు అలముకున్నాయి. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఇంకోవైపు మధ్యతరగతి ప్రజలపై ధరల పిడుగు పడుతోంది. ప్రతి వస్తువు ధర దాదాపు 25శాతం పెరిగిపోయింది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సరిగా జోక్యం చేసుకోలేదనే భావన వారిలో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే..సామాజిక పెన్షన్లు కోసం ఎదురుచూసేవారు, ఆడబిడ్డనిధి అమలు చేయలేదని, నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమబాట పడుతున్నారు. మొత్తం ప్రభుత్వం మీద ప్రతి వర్గంలో కూడా ఇంత కన్నా బాగా చేయాలని, తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే..ఈ అసంతృప్తి మరో మూడేళ్లపాటు ఉంటుందా? లేక ఇది తాత్కాలికమా అనేది చెప్పలేం. సర్వేలు అనుకూలంగా వచ్చాయి కనుక కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. సర్వేలు తీరు ఏ రకంగా ఉన్నా.... ప్రభుత్వ పనితీరుపై మెజార్టీ ప్రజలు పెదవి విరుస్తున్నారనేది పచ్చినిజం. ప్రతి పది మందిలో ఆరుగురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది ఎవరికీ రుచించినా.. రుచించకపోయినా..వాస్తవం. అయితే..ఇక్కడో మాట చెప్పుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, అసహనం నెలకొన్నా..అది జగన్మోహన్‌రెడ్డివైపు మాత్రం మరలడం లేదు. ఈ ప్రభుత్వం కన్నా జగన్ మెరుగు అనే మాట ప్రజల నుంచి రావడం లేదు. ఇదే ఈ కూటమికి శ్రీరామ రక్ష.