‘కొడాలి నాని’... ‘మాగుంట’ ఒకటేనా...!?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

మాగుంట వ్యాఖ్యలతో వైకాపాలో గగ్గోలు

ప్రకాశం జిల్లా వాసుల దశాబ్ధాల కల వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైకాపాలో గగ్గోలు పుట్టించాయి. ఆ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు, సానుభూతిపరులు ఆయన వ్యాఖ్యలను తలచుకుని ఎక్కివెక్కి, శోకాలు పెడుతున్నారు. మా నాయకుడ్ని అంత మాట అంటారా? అంటూ..మాగుంటపై విరుచుకుపడుతూ శాపనార్ధాలు, తిట్లు లంకించుకుంటున్నారు. మా నాయకుడు టిక్కెట్ ఇస్తే గెలిచిన వాడివి ఇలా మాట్లాడతావా..? అంటూ మాగుంటపై దండెత్తుతున్నారు. నాయకులుగా చెప్పుకునేవారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మాగుంటపై విరుచుకుపడుతుంటే..సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియాలో మాగుంటకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

అయితే...గతంలో జగన్‌ను ఎంతో మంది విమర్శించినా..నానా రకాలుగా అన్నా..వైకాపా ఈ రీతిలో ఎప్పుడూ దండెత్తలేదు, శోకాలు పెట్టలేదు. పైగా మాగుంట పెద్దగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఆయనో మూర్ఖుడు, మన కులం వాడని మనం ఓట్లు వేశాము...మనకు ఏమీ చేయలేదు..ఒట్టొట్టి ప్రారంభోత్సవాలు చేశాడన్నారు. ఈ వ్యాఖ్యలకే వైకాపా ఉలిక్కిపడి, నిర్ఘాంతపోయి, నిశ్చేష్టులుడి..మాగుంటపై తిట్లపురాణాన్ని ఎత్తుకుంది.

జగన్‌పై ఇతర పార్టీల విమర్శలకు లేని స్పందన.. మాగుంటపై ఎందుకు?

గతంలో కానీ, ఇప్పుడు కానీ టీడీపీ కానీ, జనసేన కానీ జగన్‌ను ఎన్నో రకాలుగా విమర్శిస్తుంటారు. ఆయనను సైకో అని, అవినీతిపరుడని, ఖూనీకోరు అని, సొంత బాబాయిని హత్య చేయించారని, తల్లీ, చెల్లీని తరిమేశాడని..ఇలా ఎన్నో రకాలుగా విమర్శించినా..వైకాపా అంతగా పట్టించుకోదు. పైగా అవి తమ నేతకు కితాబులన్నట్లు వ్యవహరిస్తుంటుంది.

అయితే..ఇప్పుడు మాగుంట చేసిన వ్యాఖ్యలపై అంతగా ఎందుకు చించుకుంటుందనే దానిపై రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాగుంట పెద్దమనిషి, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఆయన కుటుంబానికి ఎంతో పేరుంది. పైగా రెడ్డి కులంలో ఆయననో పెద్దమనిషిగా గుర్తిస్తుంటారు. సహజంగా ఆయన ఎవరితోనూ విరోధం పెట్టుకోరు. వివాదాస్పదంగా మాట్లాడరు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆయనకు ఉన్న పేరు.

అయితే..వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున మాగుంట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని వైకాపా కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, సానుభూతిపరులు కానీ ఎవరూ ఊహించలేదు. ఏదో మాట్లాడతారనుకుంటే..కులాన్ని తెచ్చి మనోడికి ఓట్లేసినా..ఏమీ చేయలేకపోయాడు..చేతకానివాడన్నట్లు ఆయన మాట్లాడడం వైకాపా మింగుడుపడలేదు. పైగా తమ నేత చేయలేని పని చంద్రబాబు చేస్తున్నాడనే అంతర్గత బాధ వెరసి వారి ఫ్రస్ట్రేషన్ అంతా...మాగుంటపై చూపుతున్నారు.

కొడాలి నాని ఎపిసోడ్‌ను గుర్తు చేస్తున్న వైకాపా

అదేమంటే..గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు గుడివాడకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబును, ఆయన భార్య భువనేశ్వరిని, ఆయన కుమారుడు లోకేష్‌ను పదే పదే దూషించేవారు. రాయడానికి అభ్యంతరకరమైన భాషలో తిట్లదండకం చదివేవారు. ఆయన నోరు తెరిస్తే..బూతుల భాషే.

చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానితో జగనే చంద్రబాబును తిట్టిస్తున్నారనే భావన అప్పట్లో ప్రజల్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గంలో కొడాలి నాని అంటే..పరమఅసహ్యం, రోత కలిగి వారంతా సంఘటితం అయ్యేందుకు కారణమైంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సామాజికవర్గం మొత్తం ఒకతాడిపైకి వచ్చిందంటే కొడాలి, వల్లభనేని వంశీనే కారణమనే భావన ఉంది.

అప్పట్లో జగన్ వారిద్దరినీ అలా ప్రోత్సహించేవారు. కొడాలి, వల్లభనేని చంద్రబాబుపై అలా దూషణలు చేయడానికి జగన్ కారణమని, పైగా జగన్ చంద్రబాబు సామాజికవర్గాన్ని దూరం పెట్టారని, చివరకు మంత్రివర్గంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిని ఉండనివ్వలేదనే కారణాలు కూడా జగన్ పట్ల చంద్రబాబు సామాజికవర్గంలో ఒక ద్వేషం, అసహ్యం రావడానికి కారణాలయ్యాయి.

ఇప్పుడు మాగుంట విషయంలోనూ అదే జరుగుతోందా?

అయితే..ఇప్పుడు మాగుంట విషయంలోనూ..అదే జరుగుతుందని వైకాపా సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాగుంటతో జగన్‌ను చంద్రబాబు తిట్టించారన్నట్లు వైకాపా సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. దీంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారంతా సంఘటితం అవుతారనే భావనతో మాగుంటపై విరుచుకుపడుతోంది.

మాగుంట చేసిన వ్యాఖ్యలను వారే విపరీతంగా ప్రచారంలోకి తెచ్చి రెడ్డి కులం మొత్తాన్ని మళ్లీ జగన్ వెనుకకు తీసుకురావాలనే లక్ష్యంతో వైకాపా సోషల్‌మీడియా ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. మాగుంట చేసిన వ్యాఖ్యలు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా వాడుకుంటూ రెడ్డి సామాజికవర్గాన్ని సంఘటితం చేసి, మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు మనమంతా కలసిరావాలన్నట్లు ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది.

అయితే..ఇది అంతగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.

మాగుంటను కొడాలి నానితో పోల్చగలమా?

మాగుంటను, కొడాలిని పోల్చలేమని, మాగుంట పెద్దమనిషి కాగా, ఆయన వ్యాఖ్యలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా లేవనే భావన ఉంది. అయితే..కొడాలి భాష, ఆహార్యం, ఉచ్ఛారణ అతి జుగుప్సాకరంగా ఉందని, అందుకే అప్పట్లో కొడాలిపై అంత వ్యతిరేకత, అసహ్యం చంద్రబాబు సామాజికవర్గంలో వచ్చిందనే అభిప్రాయం ఉంది.

ఇప్పుడు మాగుంట వ్యవహారంలో అది కనిపించడం లేదు.

రెడ్డి సామాజికవర్గ సమీకరణ సాధ్యమేనా?

మొత్తంగా చూస్తే..మాగుంట చేసిన వ్యాఖ్యల ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని జగన్‌కు మద్దతుగా పునరేకీకరణ చేయాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.