స్థానిక ఎన్నికల ముందు సర్వే కలకలం.. వైసీపీకి 83 సీట్లట!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు దాటిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించబోతున్నారు. ముందుగా కార్పొరేషన్, పట్టణ మున్సిపాల్టీలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. నేడో రేపో దీనిపై నోటిఫికేషన్ రావచ్చు. అయితే.. ఈ నోటిఫికేషన్ రాక ముందే.. ఓ సర్వే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఆ సర్వే సారాంశం ఏమిటంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు 83 సీట్లు వస్తాయట. టిడిపి కూటమికి 62 సీట్లు వస్తాయట. మరో 30 సీట్లలో టఫ్ పైట్ ఉంటుందట. అంతే కాదు.. ఉత్తరాంధ్రాలో ఉన్న 34 సీట్లలో 17 సీట్లు వైకాపా, 13 సీట్లు టిడిపి కూటమికి, కోస్తల్ ఆంధ్రాలో ఉన్న 89 సీట్లలో 37 సీట్లు వైకాపాకు, 35 సీట్లు టిడిపి కూటమికి, రాయలసీమలో ఉన్న 52 సీట్లలో వైకాపాకు 29, కూటమికి 14 వస్తాయట.
అంటే అన్ని ప్రాంతాల్లో వైకాపాకు ప్రజలు పట్టం కడతారని ఆ సర్వే పేర్కొంటుంది. ఆత్మసాక్షి పేరిట విడుదలైన ఈ సర్వేపై ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే.. ఈ సర్వే ప్రామాణికత ఏమిటో ఎవరికీ తెలియదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి ఉందని, కూటమి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని.. అందుకే ప్రజలు మళ్లీ జగన్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడుతున్నారని ఆ సర్వే చెబుతోంది. అయితే.. ఈ సర్వేపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చేస్తాయి కదా...!
స్థానిక సంస్థల ఎన్నికల ముందు కావాలనే వైకాపా ఇటువంటి సర్వేలను వదులుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దాదాపు వంద మున్సిపాల్టీలకు, పంచాయితీలకు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతాయని, ఇవన్నీ ప్రత్యక్ష పద్ధతిలో జరిగే ఎన్నికలు కనుక.. అప్పుడే అసలైన బలం తేలుతుందని, ఇటువంటి పనికిమాలిన సర్వేలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కనీసం 30 మున్సిపాల్టీలు, 25 శాతం పంచాయితీలు, నాలుగు జిల్లా పరిషత్‌లు సంపాదించినా.. ఆ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని భావించవచ్చునని వారు అంటున్నారు. రెండేళ్ల పాటు అసెంబ్లీకి వెళ్లనివారు.. ఒక ప్రజా సమస్యపై ఉద్యమించలేని వైకాపాను ప్రజలు అంత తేలిగ్గా నమ్మరని వారు అంటున్నారు.
వైకాపా గతంలో కూడా ఇదే విధమైన బూటకపు సర్వేలను వదిలిందని, అప్పట్లో టైమ్స్‌నౌ అనే ఇంగ్లీషు ఛానెల్ ద్వారా 25/25 పార్లమెంట్ స్థానాలు వైకాపాకు వస్తాయని పదే పదే సర్వేలను వదిలిందని, చివరకు ఏమైందో.. ప్రపంచం మొత్తం చూసిందని, అయినా వైకాపా పెద్దలకు బుద్ధిలేదని, మళ్లీ అదే రకమైన బూటకపు సర్వేలతో చిందులు తొక్కుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఓడిపోయిన తరువాత ఈవీఎంలపై నెపం వేయడం వారికి పరిపాటి కనుక.. ఈసారి కూడా అదే చేస్తారనే వాళ్లూ ఉన్నారు. ఏది ఏమైనా కిందపడ్డా.. పైచేయి మాదే అనడం వైకాపాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో.