మలబద్ధకం.. క్యాన్సర్ హెచ్చరిక!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.. రాత్రి 7 గంటలలోపు భోజనం చేయండి: డాక్టర్ నాగూర్ బాషా

జీర్ణకోశ సమస్యలను తొలిదశలో గుర్తిస్తేనే ప్రాణాంతక వ్యాధులకు చెక్

గుంటూరు: మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వల్ల లివర్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగూర్ బాషా హెచ్చరించారు. గ్యాస్, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను చిన్నచూపు చూడకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే అల్సర్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చని సూచించారు.

గుంటూరులోని అరండల్‌పేటలో అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆరోగ్య అవగాహన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

వయస్సు కేవలం సంఖ్య మాత్రమే... జీవనశైలే ఆరోగ్యానికి అసలు బలం

డాక్టర్ నాగూర్ బాషా మాట్లాడుతూ వయస్సు పెరగడం అనేది సహజ ప్రక్రియేనని, కానీ ఆరోగ్యంగా జీవించడం పూర్తిగా మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

సమతుల్యమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, స్నేహితులతో సామాజిక సంబంధాలు కొనసాగించడం వంటి మంచి అలవాట్లు పాటిస్తే 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

మలబద్ధకం చిన్న సమస్య కాదు... శరీరమంతా ప్రభావితం చేస్తుంది

ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య మలబద్ధకం అని డాక్టర్ బాషా తెలిపారు.

ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సహజంగా పనిచేసేదని, ఇప్పుడు ఉద్యోగాలు, జీవనశైలి మార్పులతో కూర్చునే సమయం పెరగడం, ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తుల వినియోగం అధికమవడంతో చిన్న వయస్సులోనే మలబద్ధకం సమస్య పెరుగుతోందన్నారు.

మలబద్ధకం వల్ల శరీరంలో వ్యర్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.

గ్యాస్‌కు ఇష్టానుసారం మందులు వాడితే ప్రమాదమే

పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అల్సర్లు ఏర్పడి, దీర్ఘకాలంలో అవి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు.

చాలామంది డాక్టర్ సలహా లేకుండానే గ్యాస్ సమస్యకు మందులు వాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. అలా చేయడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన సహజ యాసిడ్ తగ్గిపోయి ఆహారం సరిగా జీర్ణం కాక మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

పొట్ట ఉబ్బరమే కాదు... థైరాయిడ్ లక్షణం కూడా కావచ్చు

పొట్ట ఉబ్బరం, తరచూ తేపులు రావడం వంటి లక్షణాలను కేవలం గ్యాస్ సమస్యగా భావించవద్దని డాక్టర్ బాషా సూచించారు.

కొన్ని సందర్భాల్లో ఇవే లక్షణాలు థైరాయిడ్ సమస్య వల్ల కూడా కనిపించవచ్చని, ముఖ్యంగా పెద్దవారిలో అకస్మాత్తుగా మలబద్ధకం మొదలైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

లివర్ మన శరీరంలో అత్యంత విలువైన అవయవం

మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం లివర్ అని, జీవించి ఉన్న వ్యక్తి నుంచి కొంత భాగాన్ని దానం చేయగలిగే ఏకైక అవయవం కూడా ఇదేనని డాక్టర్ నాగూర్ బాషా తెలిపారు.

లివర్ పూర్తిగా దెబ్బతిన్న రోగులకు ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి కొంత భాగాన్ని తీసి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చని వివరించారు.

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది

ఆహారం తీసుకునే సమయానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయన పేర్కొన్నారు.

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో భోజనం చేయడం శరీరానికి మేలు చేస్తుందని, ముఖ్యంగా రాత్రి 7 గంటలలోపు భోజనం పూర్తి చేస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుందని చెప్పారు.

భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఎండోస్కోపీతో క్యాన్సర్‌ను కూడా ముందుగానే గుర్తించొచ్చు

కడుపులో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఎండోస్కోపీ ద్వారా గ్యాస్, అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపారు.

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎండోస్కోపీ అల్ట్రాసోనోగ్రఫీ (EUS) ద్వారా మరింత ఖచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతోందన్నారు.

అలాగే ఎడమవైపు ఛాతిలో మంట, చేయి లేదా దవడ వరకు నొప్పి, గుండెదడ వంటి లక్షణాలు ఉంటే వెంటనే కార్డియాలజిస్టును, ఛాతి మధ్య భాగంలో మంట, తేపులు, పొట్ట సమస్యలు ఉంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టును సంప్రదించాలని సూచించారు.

ఫ్యాటీ లివర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి

ప్రస్తుతం మద్యపానం చేసే వారిలో, అధిక బరువు ఉన్నవారిలో, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఫ్యాటీ లివర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్ నాగూర్ బాషా తెలిపారు.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన లివర్ వ్యాధులకు దారితీయవచ్చని హెచ్చరించారు.

పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారమే ఉత్తమ ఔషధం

సభ ముగింపులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ ప్రతి ఒక్కరూ పీచు పదార్థాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన సమయానికి వైద్య పరీక్షలు, సమతుల్య ఆహారమే లివర్, జీర్ణకోశ వ్యాధులను దూరం చేసే ఉత్తమ మార్గమని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా కేర్‌వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నాగూర్ బాషాను అవగాహన సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి టి.వి. సాయిరాం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించగా, జీవన సంధ్య సంస్థ అధ్యక్షుడు ఎస్. కృష్ణారావు, రాడికల్ హ్యూమనిస్ట్ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.