పేదలకు ఉచితంగా హైటెక్ వైద్యం.. జీజీహెచ్‌లో 10 ఆపరేషన్ థియేటర్లు సిద్ధం

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మహిళలు, గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారుల కోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన “మాతా-శిశు సంరక్షణ సూపర్ స్పెషాల్టీ బ్లాక్”లో శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా రూ.127 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్లాక్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

600 పడకల సామర్థ్యంతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో గర్భిణులు, మహిళలు, నవజాత శిశువులు, 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 300 పడకలను గైనిక్ విభాగానికి, 120 పడకలను నవజాత శిశువులకు, 180 పడకలను చిన్నారుల కోసం కేటాయించారు.

ఈ భవన నిర్మాణానికి జింఖానా తరపున రూ.100 కోట్లు ఖర్చు చేయగా, అత్యాధునిక పరికరాలు, మెషిన్ల కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.27 కోట్లు వెచ్చించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌ను ప్రారంభించారు. మెషిన్ల పనితీరు పరిశీలన పూర్తికావడంతో గురువారం నుంచి అధికారికంగా శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే రెండు క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు.

ఈ బ్లాక్‌లో మహిళల మాతృత్వానికి సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం ఏడు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశారు. అదనంగా శిశువులు, చిన్నారుల కోసం మరో మూడు ప్రత్యేక థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సిజేరియన్ ప్రసవాలు, గర్భసంచి తొలగింపు, అండాశయ సిస్టులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, రక్తస్రావం వంటి అత్యవసర పరిస్థితులకు తక్షణ వైద్యం అందించేలా అన్ని రకాల ఆధునిక పరికరాలు సమకూర్చారు.

ఈ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది “టోటల్ బాడీ కూలింగ్ మెషిన్”. బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే మెదడుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నాలుగు టోటల్ బాడీ కూలింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సదుపాయం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అదేవిధంగా అత్యవసర చికిత్సలో భాగంగా శిశువులు నిమిషానికి 120 సార్లు శ్వాస తీసుకునేలా సహాయపడే “హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు” కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 10 హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లను ఏర్పాటు చేశారు. నవజాత శిశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని రకాల ఆధునిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చింది.

డెలివరీ థియేటర్ల పక్కనే “స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్” ఏర్పాటు చేయడం మరో ముఖ్య ప్రత్యేకత. సాధారణంగా చాలా ఆసుపత్రుల్లో డెలివరీ రూమ్ నుంచి నవజాత శిశు సంరక్షణ కేంద్రం దూరంగా ఉంటుంది. కానీ గుంటూరు జీజీహెచ్‌లో ఈ రెండు విభాగాలను సమీపంలో ఏర్పాటు చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో శిశువులను వెంటనే చికిత్సకు తరలించే అవకాశం కలిగింది.

గైనిక్ విభాగ హెచ్‌వోడీ డాక్టర్ అరుణ వేము మాట్లాడుతూ, భవిష్యత్తులో ఈ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో ఐవీఎఫ్ చికిత్సలు కూడా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హై రిస్క్ గర్భిణుల కోసం ప్రత్యేక వార్డులు, అబ్స్ట్రెటిక్ ఐసీయూ వంటి అత్యాధునిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి అయిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు గైనిక్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారని తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్య సేవలు ఇప్పుడు పేదలకు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రావడంతో గుంటూరు జీజీహెచ్ రాష్ట్రంలోనే అత్యంత కీలక రిఫరల్ కేంద్రంగా మారుతోంది.