"23 ఏళ్లకే గుండె ఆగింది.. గుండె మార్పిడితో యువకుడికి పునర్జన్మ"
విజయవాడ: జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలతో ముందుకు సాగుతున్న 26 ఏళ్ల యువకుడు గుండె వైఫల్యం, కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి గుండె మార్పిడి ద్వారా కొత్త జీవితాన్ని పొందిన అరుదైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించిన ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇప్పుడు వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.
23 ఏళ్లకే మొదలైన గుండె సమస్యలు
శ్రీ గుండిమెడ వేద ప్రకాష్‌కు 23 ఏళ్ల వయస్సులోనే తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ప్రారంభమయ్యాయి. నడిచినప్పుడు ఊపిరి ఆడకపోవడం, గుండె దడ, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు మొదట సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించినప్పటికీ, తరువాత అవి తీవ్రమైన గుండె వ్యాధికి సంకేతాలుగా తేలాయి.
2023 మార్చిలో ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి వచ్చి స్పృహ కోల్పోయారు. అనంతరం సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. అత్యవసరంగా వైద్యులు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడగలిగారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడటం ఆయన జీవితంలో తొలి అద్భుతంగా మారింది.
ప్రమాదకర స్థాయికి చేరిన గుండె పనితీరు
తదుపరి నిర్వహించిన కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్షల్లో గుండె ఎడమ జఠరిక తీవ్రంగా బలహీనపడినట్లు గుర్తించారు. గుండె పంపింగ్ సామర్థ్యం (ఈజెక్షన్ ఫ్రాక్షన్) కేవలం 31-35 శాతానికి పడిపోయినట్లు తేలింది. సాధారణంగా ఇది 55-60 శాతం మధ్య ఉండాలి.
వైద్యులు దీనిని డయలేటెడ్ కార్డియోమయోపతి అని నిర్ధారించారు. అదే సమయంలో ప్రాణాంతకమైన Monomorphic Ventricular Tachycardia సమస్య కూడా తలెత్తడంతో డీసీ షాక్ ఇచ్చి గుండె స్పందనను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
భవిష్యత్తులో మళ్లీ కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం ఉండటంతో 2024లో ఆయనకు AICD పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం ప్రమాదకర గుండె రిథమ్‌లను గుర్తించి వెంటనే స్పందిస్తూ ప్రాణాలను కాపాడే విధంగా పనిచేస్తుంది.
గుండె మార్పిడే చివరి ఆశ
అన్ని రకాల మందులు, చికిత్సలు అందించినప్పటికీ గుండె పనితీరులో ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించలేదు. దీంతో గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని వైద్యులు సూచించారు.
ఈ నేపథ్యంలో జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా గుండె మార్పిడి కోసం నమోదు చేసుకున్నారు. శస్త్రచికిత్సకు అనుకూలంగా ఉండేందుకు వైద్యుల సూచన మేరకు ఆయన తన బరువును 105 కిలోల నుంచి 76 కిలోలకు తగ్గించుకోవడం విశేషం. ఈ క్రమశిక్షణ, సంకల్పబలం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది.
17 ఏళ్ల అవయవదాతతో లభించిన కొత్త జీవితం
గుండె కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల జీవన్మృతుడి గుండె అందుబాటులోకి రావడం కీలక మలుపుగా మారింది. ఆ యువ దాత కుటుంబం తీసుకున్న అవయవదాన నిర్ణయం వేద ప్రకాష్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
మే 26, 2026న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేపట్టారు. అత్యున్నత నైపుణ్యంతో కూడిన వైద్య బృందం సమిష్టి కృషితో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం వేద ప్రకాష్ ఆరోగ్యంగా కోలుకుంటూ సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
ఆస్టర్ రమేష్ వైద్య బృందం మరో అరుదైన విజయం
ఈ క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు, కార్డియాలజిస్టులు, కార్డియాక్ అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు మరియు నర్సింగ్ బృందం సమన్వయంతో నిర్వహించారు.
డాక్టర్ మృత్యంజయ కుమార్ ఇప్పటికే 25 గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించగా, డాక్టర్ జయరామ్ పాయ్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ భరత్ సిద్ధార్థ, డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర వంటి నిపుణులు ఈ బృందంలో కీలక పాత్ర పోషించారు.
దేశవ్యాప్తంగా ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలందించిన ఈ వైద్య బృందం ఇప్పటివరకు లక్షా పాతిక వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించిన అనుభవాన్ని కలిగి ఉంది.
అవయవదానమే మరో జీవితానికి ఆశ
ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ & ట్రాన్స్‌ప్లాంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ, "ఒక అవయవదానం అనేక కుటుంబాలకు ఆశను అందిస్తుంది. ఈ ఘటన అవయవదానం గొప్పతనాన్ని మరోసారి సమాజానికి గుర్తుచేసింది" అని తెలిపారు.
అలాగే త్వరలోనే అత్యాధునిక రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రమేష్ హాస్పిటల్స్ ట్రస్ట్‌లు సంయుక్తంగా భరించాయని తెలిపారు.