డెలివరీ కోసం వెళ్లింది.. ప్రాణాలతో తిరిగి రాలేదు.. ఆసుపత్రి సీజ్
తణుకు: ఓ బాలింత మృతి కేసు తణుకులో సంచలనంగా మారింది. గత నెలలో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో వెలుగులోకి వచ్చిన అంశాలు ఇప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖను కఠిన చర్యలకు దారితీశాయి. విచారణలో పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు బయటపడటంతో పైడిపర్రులోని స్టార్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) జి. గీతాబాయి ఆధ్వర్యంలో గురువారం ఈ చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో అనుమతులు లేకుండానే సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పాటు ఇటీవల జరిగిన బాలింత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన రింకు కుమారి అనే గర్భిణిని ప్రసవం కోసం స్థానికంగా పనిచేస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు చంటి, మరో వ్యక్తి మోషేలుతో కలిసి పైడిపర్రులోని స్టార్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యుడు సుంకవల్లి పాండురంగారావు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి శిశువును బయటకు తీశారు. అయితే అదే రోజు రాత్రి రింకు కుమారి మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ఈ ఘటన తర్వాత మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయ లోపంతో పోస్టుమార్టం ప్రక్రియ నాలుగు రోజుల పాటు ఆలస్యమైనట్లు సమాచారం. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు.
బాలింత మృతి నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆసుపత్రికి అవసరమైన అనుమతులు పూర్తిగా లేవని, కనీస మౌలిక వైద్య సదుపాయాలు కూడా సరిపడా లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శస్త్రచికిత్సలకు అవసరమైన అనస్థీషియా నిపుణుడు లేకపోవడం, తగిన సిబ్బంది అందుబాటులో లేకుండానే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బయటపడ్డాయి.
ఇంకా వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి జరిగి ఉండవచ్చనే కోణంలో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యుడు సుంకవల్లి పాండురంగారావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే నిర్ణీత గడువులో సంతృప్తికరమైన వివరణ అందించకపోవడంతో నిబంధనల ప్రకారం ఆసుపత్రిని సీజ్ చేసినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వైద్య నిర్లక్ష్యం జరిగిందా? ఆసుపత్రి నిబంధనలను ఎంతవరకు ఉల్లంఘించింది? బాలింత మృతికి అసలు కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ, పర్యవేక్షణపై మరోసారి చర్చకు దారితీసింది.