ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఇవే.. 50 ఏళ్లు దాటిన వారు తప్పక పరీక్ష చేయించుకోండి

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

డాక్టర్ జ్ఞాన ప్రకాష్ పోలుమట్ల మాట్లాడుతూ మూత్రపిండాలు, మూత్రాశయ సంబంధిత వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన ఆరోగ్య అవగాహన సభలో పాల్గొన్న ఆయన, జీవనశైలిలో మార్పులు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక మూత్ర సంబంధిత వ్యాధులను ముందుగానే నివారించవచ్చన్నారు.

మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియలో మూత్రపిండాలు, మూత్రాశయం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. మూత్రపిండాల్లో తయారైన మూత్రం యురేటర్స్ ద్వారా మూత్రాశయానికి చేరుతుందని, అది పూర్తిగా నిండినప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్లి మూత్ర విసర్జన జరుగుతుందని తెలిపారు.

మూత్రాశయంలో బ్యాక్టీరియా చేరితే ఇన్ఫెక్షన్లు వస్తాయని, దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోకపోతే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి పెరుగుదలతో మూత్ర సంబంధిత సమస్యలు అధికమవుతాయని ఆయన పేర్కొన్నారు. మూత్రం ఆగి ఆగి రావడం, మూత్రం దార సన్నగా రావడం, ఎక్కువసార్లు యూరిన్ రావడం, మూత్రాన్ని నియంత్రించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ లక్షణాలు ప్రొస్టేట్ క్యాన్సర్‌లో కూడా కనిపించే అవకాశం ఉందని తెలిపారు.

50 సంవత్సరాలు దాటిన పురుషులు, కుటుంబంలో ప్రొస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు ప్రతి సంవత్సరం పీఎస్ఏ పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ జ్ఞాన ప్రకాష్ తెలిపారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు.

ధూమపానం చేసే వారిలో, దుమ్ము, దూళి ఎక్కువగా ఉండే ఫ్యాక్టరీల్లో పని చేసే వారిలో మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికమని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే దానిని చిన్న సమస్యగా భావించకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరించారు.

మహిళల్లో నెలసరి ఆగిన తర్వాత శరీరంలో రక్షణాత్మక మంచి బ్యాక్టీరియా తగ్గిపోవడంతో మూత్రాశయ సమస్యలు పెరుగుతాయని తెలిపారు. అలాగే తక్కువ నీరు తాగడం కూడా మూత్ర సంబంధిత సమస్యలకు కారణమవుతుందని చెప్పారు. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేందుకు రోజూ తగినన్ని నీరు తాగడం చాలా అవసరమన్నారు.

నీరు తక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో మలినాలు క్రమంగా క్రిస్టల్స్‌గా మారి చివరకు రాళ్లుగా తయారవుతాయని వివరించారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నీరు తాగడం వల్ల చిన్న రాళ్లు మూత్రంతో బయటకు వెళ్లిపోతాయని, అయితే కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు.

ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీ రాళ్లకు కారణమవుతాయని తెలిపారు. ఆకుకూరలు, దుంపకూరలు అధికంగా తీసుకునేవారిలో ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

క్షయవ్యాధి కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే కాకుండా మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళాలకు కూడా సోకవచ్చని డాక్టర్ జ్ఞాన ప్రకాష్ వెల్లడించారు. మూత్రంలో రక్తం పడటం, మూత్రం ముదురు రంగులో రావడం, తీవ్రమైన నొప్పి, తరచుగా మూత్రం రావడం, కారణం లేకుండా జ్వరం, రాత్రిపూట చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ ఆరోగ్య అవగాహన సభలో విశ్రాంత ప్రభుత్వ వైద్యులు డాక్టర్ పి. సుబ్బారెడ్డి, అవగాహన సభ్యులు, సీనియర్ సిటిజెన్స్ నాయకులు పాల్గొన్నారు.