రిలయన్స్ మార్ట్లో ఎక్స్పైరీ ఫుడ్ విక్రయాలు?.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న Reliance Mart పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్, పురపాలక సిబ్బంది సంయుక్తంగా మార్ట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. జనసేన నాయకుడు పుల్లా బాబి బుధవారం రాత్రి మార్ట్లో మ్యాంగో టెట్రా ప్యాక్ కొనుగోలు చేయగా అది కాలం చెల్లినదిగా గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ఆయనతో పాటు సజ్జా సుబ్రహ్మణ్యం మార్ట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. పురుగులు పట్టిన ఉల్లిపాయలు, కుళ్లిపోయిన బంగాళదుంపలు, కాలం చెల్లిన బ్రెడ్లు, పలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దృశ్యాలు అక్కడి వినియోగదారులను షాక్కు గురిచేశాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు వినియోగించే పానీయాలు, ఆహార పదార్థాలు కూడా కాలం చెల్లినవే విక్రయించారని వినియోగదారులు వాపోయారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
తనిఖీల సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర రామిరెడ్డి మార్ట్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయినట్లు సమాచారం. సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు మార్ట్పై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.
ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, పురపాలక సంఘ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటన తర్వాత వినియోగదారులు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్స్పైరీ తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పెద్ద బ్రాండ్లపై నమ్మకంతో నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.