షాబాద్‌ వరుస హత్యల కేసుకు ముగింపు.. ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ ఆత్మహత్య

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ వరుస హత్యల కేసుకు కీలక మలుపు తిరిగింది. ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసి పరారైన ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అతడు, షాద్‌నగర్ నియోజకవర్గంలోని తన అమ్మమ్మ స్వగ్రామమైన పెంజర్ల వద్ద విషం సేవించి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు దర్యాప్తులో కీలక అధ్యాయం ముగిసింది.

మూడు రోజుల పోలీసుల వేట.. చివరకు మృతదేహం లభ్యం

ఆరుగురి హత్యల అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు చేపట్టారు. రూ.2 లక్షల రివార్డు ప్రకటించి 14 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్, సెల్‌ఫోన్, రూ.1,600 నగదు, రెండు బస్ టికెట్లు లభించాయి. ప్రాథమిక విచారణలో అతడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

రైలు కింద పడాలని ప్రయత్నం.. చివరకు విషం సేవించి ఆత్మహత్య

పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మొదట రాజ్‌కుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. అయితే చివరి క్షణంలో వెనక్కి తగ్గిన అతడు, పోలీసులు మరింత దగ్గరపడుతున్నారని గ్రహించి విషం సేవించి ప్రాణాలు తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతడు మూడు రోజుల పాటు కొత్తూరు మండలంలో ఎక్కడ ఆశ్రయం పొందాడు, ఎవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఒకే రాత్రిలో ఆరుగురి హత్య

35 ఏళ్ల రాజ్‌కుమార్‌పై గతంలో ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మొదట మైనర్ బాలిక ఇంటికి వెళ్లి ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న బాలిక తల్లి, నాయనమ్మను కత్తితో హత్య చేశాడు. అనంతరం బాలికను తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు. అక్కడి నుంచి తన ఇంటికి చేరుకుని భార్య సరితతో పాటు ఇద్దరు చిన్నారుల గొంతు కోసి హత్య చేశాడు. మొత్తం ఆరుగురిని హత్య చేసి అక్కడి నుంచి కారులో పరారయ్యాడు.

సెల్ఫీ వీడియోలో పశ్చాత్తాపం

ఆత్మహత్యకు ముందు రాజ్‌కుమార్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. తాను ప్రేమించిన యువతి కుటుంబానికి భారీగా డబ్బు ఖర్చు చేశానని, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయానని వీడియోలో పేర్కొన్నాడు. తనపై పోక్సో కేసు నమోదు కావడంతో మానసికంగా కుంగిపోయానని, తీవ్ర ఆవేశంలో హత్యలకు పాల్పడ్డానని చెప్పినట్లు సమాచారం.

అంతేకాదు, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా రూ.2 కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయానని, తన తప్పులకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వీడియోలో పేర్కొన్నాడు. తన పిల్లలకు ఆస్తి కూడా మిగిల్చలేకపోయానని, తాను చేసిన తప్పుకు తానే శిక్ష విధించుకుంటున్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

కేసు ముగిసినా.. మిగిలింది విషాదమే

రాజ్‌కుమార్ ఆత్మహత్యతో నిందితుడి కోసం సాగిన గాలింపు ముగిసినప్పటికీ, ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు, మహిళలతో సహా ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధితులు ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో షాబాద్ ఎస్సైను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఇక ఈ కేసులో రాజ్‌కుమార్‌కు ఎవరైనా సహకరించారా? పరారీలో ఉన్న మూడు రోజుల వ్యవధిలో ఎవరి వద్ద ఆశ్రయం పొందాడు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.