మహిళల భద్రతకే ‘శక్తి’ టీమ్ ప్రాధాన్యత
వేటపాలెం : మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చీరాల డిఎస్పి ఎం.డి. మోయిన్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు, బాల్య వివాహాలు నివారణా సంఘాలకు చెందిన సుమారు 300 మంది మహిళలకు వేటపాలెంలోని వెంకటేశ్వర కల్యాణమండపంలో ఉమెన్ సేఫ్టీ, మాదకద్రవ్యాలపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను వాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా
‘శక్తి యాప్’ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలని, ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ యాప్ ద్వారా తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాల వంటి సామాజిక అరిష్టాలను అరికట్టడంలో విద్యార్థులు చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తెలియని లింక్ లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు. అలాగే చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) గురించి వివరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు
సేవించడం వల్ల కలిగే అనర్దల గురించి వివరించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత 112, 181, 1091, 1098 హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో టి. ఝాన్సీ, చీరాల రూరల్ సిఐ సుధాకర్, వేటపాలెం ఎస్.ఐ జనార్దన్, చీరాల సబ్ డివిజన్ శక్తి టీమ్ ఎస్.ఐ హరిబాబు, పీసీలు సుబ్బారావు, సునీత, ధనలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.