టీటీడీ ఛైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం పూర్తికావడంతో ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్-III) శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 658ను సోమవారం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్-1987లోని సెక్షన్ 137 ప్రకారం ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టింది. ప్రత్యేక అధికారుల బృందం ఛైర్మన్‌గా టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ముద్దాడ రవిచంద్ర, ఐఏఎస్‌ను నియమించింది. సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి వి. వినయ్ చంద్, ఐఏఎస్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రభుత్వ కార్యదర్శి (ఎఫ్ఏసీ) కె. కన్నబాబు, ఐఏఎస్‌లను నియమించింది. ఈ ప్రత్యేక అధికారుల బృందం టీటీడీ పాలకమండలి నిర్వహించే అన్ని అధికారాలను వినియోగించడంతోపాటు, దాని విధులను నిర్వర్తించనుంది. ఈ నియామకం ఏడాది పాటు లేదా కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటివరకు ప్రత్యేక అధికారుల బృందం కొనసాగుతుంది.
సమర్థుడికి సముచితమైన పదవి...!
సీనియర్ ఐఏఎస్ రవిచంద్రకు నిజాయితీపరుడు, సమర్థుడు, నిరాడంబరుడు అనే పేరుంది. సమర్థుడికి, నిజాయితీపరుడికి సరైన పోస్టు దక్కిందనే భావన అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవిచంద్రను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించి సీఎంఓ అధిపతిగా నియమించారు. రవిచంద్ర సమర్థత, నిజాయితీని గుర్తించే ముఖ్యమంత్రి ఆయనకు ఆ పదవి అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలను నిలబెడుతూ రవిచంద్ర సీఎంఓలో పనిచేశారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన సీఎంఓపై ఎటువంటి విమర్శలు, ఆరోపణలు రాకుండా పనిచేశారు. అయితే.. ఓ దినపత్రికలో వచ్చిన ఒక వార్త రవిచంద్రను మనస్తాపానికి గురిచేసింది. ఇది కొందరు కావాలనే ఆయనపై చేసిన కుట్రగా తరువాత తేలింది. అయితే.. అప్పటి నుంచి ఆయన అన్యమనస్కంగానే సీఎంఓలో ఉన్నారు. తరువాత బదిలీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ ఈవో పోస్టుకు రవిచంద్రను బదిలీ చేశారు. తాను కూడా ఎప్పటి నుంచో దేవదేవుని వద్ద పనిచేయాలనే భావనతో ఉన్న రవిచంద్ర వెంటనే తిరుమలకు వచ్చేశారు.
సమర్థవంతంగా సామాన్య భక్తులకు సేవలు
టీటీడీ ఈవోగా రవిచంద్ర బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి టీటీడీలో పెను మార్పులు వచ్చాయి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ.. ఆయన దేవదేవుడిని సామాన్యులకు దగ్గర చేశారు. గతంలో పనిచేసిన ఈవోల కంటే సమర్థంగా ఆయన తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. గతంలో.. టీటీడీపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. రవిచంద్ర బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎటువంటి వివాదాలు కానీ, విమర్శలు కానీ ఎవరు చేయలేదంటే రవిచంద్ర పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తిరుమలపై చీటికి మాటికి విమర్శలు, ఆరోపణలు చేసే వైకాపా నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి కూడా రవిచంద్ర వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి యాగీ చేయలేదు. ఎందుకంటే.. రవిచంద్ర విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశమే ఇవ్వకుండా పనిచేయడమే దానికి కారణం. టీటీడీ ఈవోగా రవిచంద్ర శ్రీవారి సేవల్లో సంప్రదాయానికి పెద్దపీట వేస్తూనే సాంకేతికతను జోడిస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో, ఆలయ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు కృత్రిమ మేధ (ఏఐ)లను అందుబాటులోకి తేనున్నారు. సామాన్య భక్తుల ఇబ్బందులను తీర్చడానికి, వారికి సత్వరం దేవదేవుడి దర్శనం అయ్యేందుకు ఈ విధానాన్ని తేవాలని భావిస్తున్నారు.
భక్తులకు బీమా సౌకర్యం...!
గతంలో ఏ ఈవో చేయని విధంగా తిరుమల తిరుపతికి వచ్చే భక్తుల్లో ఎవరైనా మరణిస్తే.. వారికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ఈవో చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా అలిపిరి వద్ద 29 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మించబోతున్నారు. దీని ద్వారా సామాన్య భక్తులకు వసతితో పాటు కొండపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా తిరుమలలో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ భారీగా మొక్కలను నాటే కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం మీద ఈవోగా రవిచంద్ర తన పనితీరుతో శ్రీవారి భక్తులను మెప్పిస్తున్నారు. అదే సమయంలో ఎటువంటి వివాదాల జోలికి పోకుండా దేవదేవుడికి సేవలు చేస్తూ ఆయన నామస్మరణతో తరిస్తున్నారు.