మహిళల ఆరోగ్యానికి యోగా రక్షణ కవచం.. PCOS నివారణలో కీలక పాత్ర: డాక్టర్ షమా సుల్తాన

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు, జూన్ 23: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అత్యుత్తమ రక్షణ కవచమని హోప్ విన్ హాస్పిటల్స్ చైర్‌పర్సన్, ది పింక్ స్టెప్ ఫౌండర్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తాన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరులోని రాజీవ్ గాంధీ నగర్ పీహెచ్‌ఆర్ కన్వెన్షన్‌లో మహిళలకు యోగా ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి కాలంలో మహిళల్లో పెరుగుతున్న పీసీఓఎస్ (PCOS) వంటి ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో యోగా, జుంబా వ్యాయామం, సమతుల ఆహారం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం యోగా ట్రైనర్లు లక్ష్మి, శ్రావణి ఆధ్వర్యంలో యోగా సెషన్ నిర్వహించగా, నర్సి మాస్టర్ ఆధ్వర్యంలో జుంబా డాన్స్ కార్యక్రమం ఆకట్టుకుంది. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించుకున్నారు.

యోగా ట్రైనర్లు లక్ష్మి, శ్రావణి మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని, ప్రతి మహిళ నిత్య జీవితంలో యోగాను భాగంగా మార్చుకోవాలని సూచించారు. మహిళల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ షమా సుల్తానను అభినందించారు.

ఈ కార్యక్రమంలో హోప్ విన్ హాస్పిటల్స్ సిబ్బంది, వెంకటేశ్వర స్కూల్ సిబ్బంది, రాజీవ్ గాంధీ నగర్ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.