వైకాపా వస్తే.. నేనే సీఎస్.. సీనియర్ ఐఏఎస్ ధీమా?
మళ్లీ తమదే అధికారం.. వైకాపా వర్గాల్లో ధీమా
సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నా...వైకాపా నాయకుల్లో, అభిమానుల్లో, సానుభూతిపరుల్లో మళ్లీ తమదే అధికారమనే భావన వ్యక్తం అవుతోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా..తాము అధికారంలోకి వస్తామని వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనే కాదు..ఆయనతో పాటు..ఆయనను అభిమానించే ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఇదే భావనలో ఉన్నారు.
కూటమి పాలనపై పెరుగుతున్న అసంతృప్తి
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, ముఖ్యంగా ఆ పార్టీకి కొమ్ము కాసిన వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని, పార్టీ కోసం ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్న కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ప్రస్తుత పాలన చూసి..అసంతృప్తి, అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తూ..ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఆ పార్టీకి కొమ్ము కాయరని, మళ్లీ కూటమిని గెలిపించడానికి ఆసక్తి చూపించరని, దీంతో వైకాపా గెలుపు సునాయాసం అవుతుందనే ధీమా వారిలో ఉంది.
దీనిలో చాలా వరకు నిజం కూడా ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీ అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ఆ పార్టీ వర్గాలు ఆశించిన విధంగా పనిచేయడం లేదనే అసంతృప్తి, అసహనం ఉన్నమాట నిజం.
కూటమి ఓటర్లకు మేలు జరగడం లేదనే వాదన
కూటమి గెలిచినా..ఇంకా వైకాపా పెత్తనమే నడుస్తోందని, పాలనలో వైకాపా వర్గాలకే మేలు జరుగుతుందని, కూటమి కోసం ఓటు వేసిన వారికి ఏమీ వరగలేదనేది నిష్టుర సత్యం. కూటమి బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెబుతోన్న సూపర్ సిక్స్ వల్ల కూటమికి ఓటు వేసిన వారికి పెద్దగా మేలు జరగడం లేదు.
అసలు కూటమికి ఓటు వేసిన వారిలో మెజార్టీ వర్గాలకు ఈ సూపర్ సిక్స్ వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే సూపర్‌సిక్స్ వల్ల మేలు జరుగుతోంది..వైకాపా ఓటర్లకే. తల్లికివందనం, మహిళా శక్తి వంటి పథకాలు వైకాపాను అభిమానించేవారికే ఎక్కువగా వర్తిస్తున్నాయి. కూటమికి ఓటు వేసిన వారికి వీటి వల్ల పెద్దగా లబ్ది చేకూరడం లేదు.
అవినీతి, ఆశ్రితపక్షపాతంపై ఆరోపణలు
కూటమిని అభిమానించేవారికి ఈ ప్రభుత్వం ఒరిగిస్తున్నదేమీ లేదు. అంతే కాదు..వైకాపా వలే అవినీతి, ఆశ్రితపక్షపాతంతో పాలన చేస్తుండడంతో..వైకాపాకు..ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడాలేదనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో..కూటమి ఓటు బ్యాంక్ చేజారుతుంది. అదే సమయంలో వైకాపా ఓటు బ్యాంకు నిలకడగా ఉంటోంది.
పైగా ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుండడంతో..వైకాపా నాయకుల్లో మళ్లీ తామే వస్తామనే ధైర్యం, ధీమా రోజు రోజుకు పెరుగుతోంది.
ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లోనూ జగన్‌పై నమ్మకం?
ఈ ధీమాతోనే వైకాపాను అభిమానించే ఐఏఎస్, ఐపిఎస్ వర్గాల్లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని, తమకు తాము కోరుకున్న పోస్టులు వస్తాయనే భావన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఐఏఎస్ వర్గాల్లో కొందరు జగన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారు.
సీనియర్ ఐఏఎస్‌లు, జూనియర్ ఐఏఎస్‌లు కూడా వైకాపాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు మద్దతు ఇచ్చినా తమను ఏమీ చేయలేదనే భావనతో వారు ఇష్టారాజ్యంగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
వైకాపా వస్తే.. తానే సీఎస్ అంటున్న సీనియర్ ఐఏఎస్?
తాజాగా ఓ సీనియర్ ఐఏఎస్ బాహాటంగానే జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే..తానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అవుతానని చెప్పుకుంటున్నారు.
గత వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, బటన్ నొక్కుడుకు అన్ని విధాలుగా సహకరించిన ఈ ఐఏఎస్ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈయనకు అత్యంత ప్రాధాన్యత పోస్టులను కూడా కట్టబెట్టారు.
పాత బాస్‌కు మద్దతు.. కీలక పదవిపై ఆశలు?
ఆ మధ్య కాలంలో తన వ్యక్తిగత వ్యవహారంలో పత్రికలకు ఎక్కిన ఈ ఐఏఎస్‌కు చంద్రబాబు ఎక్కడా ప్రాధాన్యత తగ్గించలేదు. పైగా మంచి పోస్టు ఇచ్చి సత్కరించారు. అయితే..ఈ ఐఏఎస్ తన పాత బాస్ భజనే చేస్తున్నారు.
మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని, తాను సిఎస్‌ను అవుతానని ఆయన బాహాటంగానే చెబుతున్నారట.
మూడేళ్ల ముందే పదవులపై లెక్కలు?
మొత్తం మీద..ప్రస్తుత కూటమి పార్టీల చేతగానితనం, అవినీతి, ఆశ్రితపక్షపాతం, తమకు మేలు చేసిన వారిని మరిచి, సొమ్ములు ఇచ్చే వారిని దగ్గరకు తీయడం వంటి కారణాలతో పాటు, గత ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలు చేసిన వారిన శిక్షించకపోవడం వంటి చర్యలతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకుంటోంది.
అందుకే ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నా..వైకాపాలో, ఆ పార్టీని అభిమానించే వారిలో మళ్లీ తామే అన్న ధీమా, ధైర్యం వ్యక్తం అవుతోంది. దీన్ని చూసే.అత్యున్నతాధికారులు కూడా అప్పుడే పోస్టులు పంచుకుంటున్నారు.