లేటెస్ట్

బిజెపిలోకి 'మోహన్‌బాబు' కుటుంబం...!

సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు 'మంచు మోహన్‌బాబు' కుటుంబం త్వరలో బిజెపిలో చేరబోతోందని తెలుస్తోంది. ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో 'మోహన్‌బాబు'తో పాటు ఆయన కుమార్తె 'మంచు లక్ష్మి, మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికాలతో భేటీ అయ్యారు. ప్రధానితో వారు దాదాపుగా 35 నిమిషాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా 'మోడీ' వారిని బిజెపిలో చేరమని ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. 'మోడీ' ఆహ్వానాన్ని మన్నించి తాము త్వరలో బిజెపిలో చేరతామని 'మోహన్‌బాబు' కుటుంబం చెబుతోంది. 

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తన బంధువైన, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పార్టీలో 'మోహన్‌బాబు' చేరారు. తన మేనల్లుడు పార్టీ విజయం సాధిస్తుందని, ఆయన ముఖ్యమంత్రి అవుతారని అప్పట్లో 'మోహన్‌బాబు' పేర్కొన్నారు. అంతే కాకుండా అప్పటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. తన స్కూల్‌కు రావాల్సిన రీఎంబర్స్‌మెంట్‌ ఇంకా రాలేదని, తనపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ...'మోహన్‌బాబు' తన తనయులతో కలసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అంతే కాకుండా తన స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులందరినీ రోడ్డుపైకి తీసుకువచ్చి వారితో కూడా ధర్నా, ఆందోళనలు చేయించారు. ఇదంతా గతం...ఆయన ఆశించినట్లే..ఆయన మేనల్లుడు 'జగన్మోహన్‌రెడ్డి' ముఖ్యమంత్రి అవడంతో 'మోహన్‌బాబు' సంతోషించారు. అయితే ఉన్నట్లుండి...ఆయన ఎందుకు పార్టీ మారాడో..ఎవరికీ అర్థం కావడం లేదు. తన బంధువుకు మద్దతు ఇస్తున్నాన్న 'మోహన్‌బాబు'ను 'జగన్‌' పట్టించుకోకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే 'మోహన్‌బాబు' ఢిల్లీ వెళ్లి 'ప్రధాని'ని కలిశారని వార్తలువస్తున్నాయి. 

'జగన్‌' ముఖ్యమంత్రి అయిన తరువాత..'మోహన్‌బాబు' అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ..ఆయనను కలసినట్లు వార్తలు రాలేదు. 'మోహన్‌బాబు' తనయుడు 'విష్ణు' వివాహం చేసుకుంది...స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కుమార్తెనే. అలా 'మోహన్‌బాబు' 'జగన్‌' కుటుంబం మధ్య బంధుత్వం నెలకొంది. తన బంధువు ముఖ్యమంత్రి కావాలని, 'మోహన్‌బాబు' తన వంతుగా గతంలో ఉద్యమాలు నిర్వహించారు. మరి ఇప్పుడు ఏమైందో కానీ..ఒక్కసారిగా పార్టీ మార్చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషించిన 'మోహన్‌బాబు'కు అప్పట్లోనే ఎన్టీఆర్‌ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆ తరువాత 'చంద్రబాబు'తో విభేదాల వల్ల పార్టీని వీడారు. తరువాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. 'చంద్రబాబు' తనకు మంచి మిత్రుడని, అదే విధంగా 'జగన్‌' బంధువని పలుసార్లు ఆయన పేర్కొనడం విశేషం. 

(428)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ