గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక పెట్ స్కాన్.. పేదలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఆంధ్రప్రదేశ్‌లో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (PET Scan) సదుపాయాన్ని తొలిసారిగా ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరులోని గుంటూరు జీజీహెచ్ పరిధిలో ఉన్న నాట్కో క్యాన్సర్ కేంద్రంలో రూ.18 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పెట్ స్కాన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.

పేదలకు ఉచితంగా అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ

ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే పెట్ స్కాన్ సదుపాయం అందుబాటులో ఉంది. అక్కడ ఒక్క పరీక్షకు సగటున రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే గుంటూరు జీజీహెచ్ పరిధిలోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. క్యాన్సర్ రోగులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రూ.41 కోట్లతో క్యాన్సర్ కేంద్రం విస్తరణ

గుంటూరు నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని లెవల్-1 స్థాయి వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే లినాక్, హెచ్డీఆర్ బ్రాకీథెరపీ, సీటీ స్టిమ్యులేటర్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. అదనంగా యూఎస్ఏ నుంచి అత్యాధునిక పెట్ స్కాన్ యంత్రాన్ని తెప్పించింది. ట్రయల్ రన్‌లో దీని పనితీరును పరిశీలించగా ఇప్పటికే 50 మంది రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేంద్రంలో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్రివెంటివ్ ఆంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత క్యాన్సర్ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాట్కో ట్రస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని నిర్మించింది.

క్యాన్సర్ కణాలను కచ్చితంగా గుర్తించే టెక్నాలజీ

పెట్ స్కాన్ ద్వారా శరీరంలో క్యాన్సర్ కణం ఎక్కడ దాగి ఉన్నా గుర్తించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఏ దశలో ఉంది? శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించిందా? అనే విషయాలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఈ స్కాన్ ఉపయోగపడుతుంది. సీటీ స్కాన్‌లో ఎముకలు, ఎంఆర్ఐలో కణజాలం మాత్రమే స్పష్టంగా కనిపిస్తే, పెట్ స్కాన్‌లో క్యాన్సర్ కణితిని అత్యంత స్పష్టంగా గుర్తించవచ్చు.

ఈ టెక్నాలజీ సహాయంతో చుట్టుపక్కల ఆరోగ్యకర అవయవాలకు హాని కలగకుండా క్యాన్సర్ కణాలపై మాత్రమే ఎంత రేడియేషన్ ఇవ్వాలనే విషయాన్ని వైద్యులు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతారు. ప్రస్తుతం కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, ఎండోక్రైనాలజీ వంటి ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కూడా పెట్ స్కాన్‌ను వినియోగిస్తున్నారు.

గడిచిన ఏడాదిలో నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఓపీ ద్వారా 19,598 మంది, ఐపీ ద్వారా 6,942 మంది చికిత్స పొందగా, 3,363 మంది కీమోథెరపీ, 965 మంది రేడియేషన్ థెరపీ చేయించుకున్నారు. 1,131 మంది క్యాన్సర్ సర్జరీలు చేయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.