విదేశాల్లో ఉద్యోగాలకు భారీ అవకాశాలు.. ఏపీ యువతకు గుడ్‌న్యూస్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఎన్టీఆర్ జిల్లా యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు OMCAP ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్, జర్మనీ, ఇజ్రాయిల్ దేశాల్లో అర్హత కలిగిన యువతీ యువకులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు అందించనున్నట్లు ప్రకటించారు.

ఇజ్రాయిల్ దేశంలోని హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. జీడీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో పాటు బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.1.99 లక్షల వరకు వేతనం లభించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ మే 15, 2026గా నిర్ణయించారు.

అలాగే జర్మనీ దేశంలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం కూడా దరఖాస్తులు కోరుతున్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో రెండేళ్ల కోర్సు పూర్తి చేసి, సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.2.6 లక్షల నుంచి రూ.2.7 లక్షల వరకు వేతనం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ మే 25, 2026.

దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు బేసిక్ డ్రైవింగ్ స్కిల్స్ కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి AED 4000 నుంచి 5000 వరకు నెలవారీ ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు మే 19, 2026న విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలోని OMCAP కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు పాస్‌పోర్ట్, విద్యార్హతలు, అనుభవ ధృవపత్రాలతో ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు కోరారు.