రేపే రైతుల ఖాతాల్లో రూ.7,000.. 46.85 లక్షల కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు.
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు ఉన్నాయి.
ఒక్కో రైతుకు రూ.7,000 జమ
ఈ ఏడాది తొలి విడతలో ఒక్కో అర్హ రైతు కుటుంబానికి రూ.7,000 అందనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2,000 చొప్పున జమ చేయనుంది.
ఈ విడత కోసం మొత్తం రూ.3,125.47 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లు.
ఏడాదికి రూ.20 వేల సాయం
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతున్న అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ప్రభుత్వం రూ.8,985.41 కోట్లు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లు.
లింగంగుంట్లలో సీఎం కార్యక్రమం
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా లింగంగుంట్లలో పర్యటించనున్నారు.
ఉదయం 11:55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, 12:15 గంటలకు లింగంగుంట్లకు చేరుకుంటారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తారు. తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటారు.
సాయంత్రం ప్రజావేదికలో జరిగే సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా కొనసాగుతోంది. తొలి విడత నిధుల విడుదలతో లక్షలాది రైతు కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించనుంది.