రెండు ద్రోణుల ప్రభావం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, జూన్ 28: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు, అలాగే అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు రెండు ద్రోణులు విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు

సోమవారం (జూన్ 29) కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముంది.

మంగళవారం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలకు హెచ్చరిక

మంగళవారం (జూన్ 30) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం

ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

  • మంగళగిరి (గుంటూరు) – 68.2 మి.మీ.
  • రాజాం (విజయనగరం) – 52.5 మి.మీ.
  • కాకుమాను (గుంటూరు) – 51.5 మి.మీ.
  • తాడేపల్లి – 45.2 మి.మీ.
  • కవులూరు (ఎన్టీఆర్ జిల్లా) – 41.5 మి.మీ.
  • భట్టిప్రోలు (బాపట్ల జిల్లా) – 39.9 మి.మీ.

ప్రజలకు కీలక సూచనలు

వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

  • చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దు.
  • తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి.
  • ఉరుములు వినిపించిన వెంటనే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుకాపరులు పొలాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
  • అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజుల పాటు అనుకూలంగా లేకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.