ఏపీకి డబుల్ అలర్ట్: రేపు పిడుగులతో వర్షాలు.. ఈ 19 జిల్లాల ప్రజలు జాగ్రత్త!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (జూన్ 20) వాతావరణంలో మరోసారి మార్పులు చోటుచేసుకోనున్నాయి. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ జిల్లాల్లో వర్షాలకు అవకాశం

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రజలకు కీలక హెచ్చరిక

పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని అధికారులు సూచించారు. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఉరుములు వినిపించిన వెంటనే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుకాపరులు పొలాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఈరోజు అత్యధిక వర్షపాతం ఎక్కడ?

సాయంత్రం 5 గంటల నాటికి నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

  • అనంతపురం జిల్లా సిద్దరాంపురం – 61 మి.మీ
  • శ్రీకాకుళం జిల్లా కొత్తూరు – 36 మి.మీ
  • వైఎస్సార్ కడప జిల్లా చౌడూరు – 31 మి.మీ
  • శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టి – 29.9 మి.మీ
  • విజయనగరం జిల్లా గుర్ల – 28.2 మి.మీ
  • శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి – 26.5 మి.మీ
  • శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి – 26.2 మి.మీ
  • శ్రీకాకుళం జిల్లా లావేరు – 22.5 మి.మీ
  • కర్నూలు జిల్లా తోవి – 22 మి.మీ
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.