అమరావతికి మరో మెగా హాస్పిటల్.. నిడమర్రులో కిమ్స్ భూమిపూజ

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి ప్రాంత ఆరోగ్య రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నిర్మించనున్న అత్యాధునిక KIMS Hospitals వైద్యశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను అమరావతి పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కిమ్స్ వైద్యశాలల వ్యవస్థాపక అధ్యక్షులు, నిర్వాహక సంచాలకులు బొల్లినేని భాస్కరరావును కలిసి అభినందనలు తెలిపారు. అమరావతి అభివృద్ధి అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విద్య, వైద్యం, ఉపాధి రంగాల అభివృద్ధే అసలైన అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు.

నిడమర్రులో నిర్మితమవుతున్న కిమ్స్ వైద్యశాల ఈ ప్రాంత ప్రజలకు సంజీవనిలా మారుతుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను స్థానికంగా అందించాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న బొల్లినేని భాస్కరరావు కృషి అభినందనీయమని కొనియాడారు.

అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలు, పరిశ్రమలు, వైద్యశాలలు స్థాపన అవుతుండటం అభివృద్ధి సువర్ణాధ్యాయానికి నాంది పలుకుతోందని పేర్కొన్నారు. కిమ్స్ వంటి మెగా వైద్యశాలల రాకతో యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అదే సమయంలో ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య రంగంతో పాటు అమరావతి ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో అమర్ శేషేంద్రతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య రంగ ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.