ప్రభుత్వ వ్యతిరేకత... అంటూ నసిగేవాళ్లు... ఇప్పుడేమంటారో...!?
రెండున్నరేళ్ల కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుపొందుతారని కొందరు రాజకీయ, అధికార వ్యవస్థకు చెందిన వ్యక్తులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఈ మాటలు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వారికి భవిష్యత్తుపై ఆశలు అలా ఉంటాయి. వారిని తప్పు పట్టడానికేమీ లేదు.
అయితే... ఈ వ్యాఖ్యలు వారి నుంచి కాదు. అధికార పార్టీలో ముఖ్యులుగా చలామణి అవుతూ, అధికార పదవులు అనుభవిస్తూ, కాంట్రాక్టులు చేసుకుంటూ, కూటమి వల్ల ప్రయోజనాలు పొందుతూ, సొమ్ములు చేసుకుంటూ ఉన్న వ్యక్తులే ఈ ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. వీరికి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనధికార సంభాషణల్లో వ్యాఖ్యానిస్తూ, వారికి మద్దతు ఇస్తూ ఉంటారు. వీరికి తోడు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్బుక్ పేజీలు, వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారు తోడై ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తుంటారు.
కూటమి ప్రభుత్వ పెద్దలపైనే అసంతృప్తి అస్త్రాలు
వీరిలో కొందరు తమ పనులు కాక ప్రభుత్వంపై బురద చల్లుతుంటే... మరికొందరు మాత్రం ప్రభుత్వ పెద్దలు తాము చెప్పినట్లు చేయడం లేదనే దుగ్ధతో ఇష్టారాజ్యంగా తమ వాల్స్‌పై, పబ్లిక్ ప్లేస్ల్లో వ్యాఖ్యలు చేస్తుంటారు.
వీరి సంగతి ఇలా ఉంటే... టీడీపీ సానుభూతిపరుల పేరుతో మరికొందరు ఇదే రకమైన ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు. వీరి బాధ ఏమిటంటే... చంద్రబాబు, లోకేష్‌లు అదెందుకు చేయలేదు? ఇదెందుకు చేయలేదు? వారినెందుకు అరెస్టు చేయలేదు? వీరినెందుకు వదిలిపెట్టారు? ఆ అధికారిని ఎందుకు బదిలీ చేయలేదు? ఈ మంత్రిని ఇంకా పదవి నుంచి ఎందుకు తొలగించలేదు? ఇలా సాగుతుంది వీరి వ్యవహారం.
యూట్యూబ్ వేదికగా ఇష్టారాజ్యపు వ్యాఖ్యలు
వీరికి తోడు కొందరు యూట్యూబ్ మేధావులు తయారయ్యారు. ఇటీవల కాలంలో ఇద్దరు పెద్దమనుషులు ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వలే లోకేష్ కూడా అవినీతికి పాల్పడుతున్నారని, జగన్ కంటే లోకేష్ ఏమీ తక్కువ కాదంటూ వారు సూత్రీకరిస్తుంటారు. వీటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే... అదేమీ ఉండదు. జగన్ వస్తే... ఇక చూసుకో అంటూ హెచ్చరికలు చేస్తుంటారు.
జగన్ అవినీతిని సమర్థిస్తూ.. లోకేష్‌పై ఆరోపణలా?
జగన్ అవినీతిని, అరాచకాన్ని తక్కువ చేసి చూపిస్తూ, లోకేష్ కూడా అవినీతికి, అరాచకానికి పాల్పడుతున్నారంటూ పదే పదే వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని ఈ పెద్దలు తీర్పులు ఇచ్చేస్తుంటారు. రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం చేశారని, ఆయన ఉండి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేదని, ఆయన లేకపోవడం వల్లే రాష్ట్రం ఇలా తయారైందని ఆ పెద్దమనిషి సెలవిస్తారు.
రాజశేఖర్‌రెడ్డి అవినీతి గురించి ప్రశ్నిస్తే... ఎవరు అవినీతి చేయడం లేదు? అంటూ సమర్థిస్తూ, లోకేష్ అవినీతి అంటూ విషం చిమ్ముతుంటారు.
మున్సిపల్ ఎన్నికల తీర్పుతో తలకిందులైన ప్రచారం
అయితే... ఇటువంటి వారి నోట్లో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో, ఇన్నాళ్లూ తాము చేసిన నిరాధార ప్రచారానికి ఇప్పుడు ఏ ముసుగు తొడుగుతారో చూడాలి. కూటమిపై ప్రజల్లో అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత అంటూ చేసిన ప్రచారాన్ని ప్రజలు బద్దలు కొట్టడంతో, ఇప్పుడు ప్రజల తీర్పుకు ఏ వక్రమార్గపు సందేశాలను వదులుతారో చూడాలి.
ప్రభుత్వంపై అసంతృప్తి లేదా? వాస్తవ పరిస్థితి ఇదీ!
అయితే... కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి లేదా అంటే... అసలు లేదని చెప్పడం అవాస్తవం. ఏ ప్రభుత్వమైనా, ఎంత బాగా పరిపాలన చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేదు. ఇది ఎవరి వల్ల అయ్యే పనికాదు. అయితే... దానిలో హెచ్చుతగ్గులను చూడాలి. అంతేకానీ, కొన్ని విషయాలను పట్టుకుని అదే ప్రజల తీర్పు అన్నట్లు పదే పదే ప్రచారం చేయడమనేదే అభ్యంతరకరం.
మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇటువంటి వారి నోరును తాత్కాలికంగానైనా మూతపడే విధంగా చేస్తుందేమో? చూద్దాం...!