జగన్‌ను మరోసారి ఆదుకున్న బిజెపి...!
నగర, పురపాలక ఎన్నికల్లో అధికార కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలకు ముందు చాలా మంది ఈ ఎన్నికల్లో కూటమినే గెలుస్తుందని భావించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యుల బలం బ్రహ్మాండంగా ఉంది.. ఇంకేముంది.. వాళ్లే గెలుస్తారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, గెలుస్తారు కానీ, మరీ ఇంత సులువుగా, అసలు పోటీనే ఉండదని మాత్రం ఎవరూ అనుకోలేదు. వైకాపా నుంచి గట్టి పోటీ ఉంటుందని, హోరాహోరీగా పోటీ సాగుతుందని, చివరకు స్వల్ప తేడాలతో కూటమి గెలుస్తుందని భావించారు.
అయితే, ఇప్పుడు వచ్చిన ఫలితాలు పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే కూడా ఏకపక్షంగా ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో అంతా కూటమిదే హవా. ఇక్కడ గెలుపు గురించి కాదు.. మాట్లాడేది వచ్చిన మెజార్టీల గురించి. ఒక్కో మేయర్ అభ్యర్థికి రెండున్నర లక్షలు, లక్షన్నర, లక్ష, 80 వేలు.. ఇలా మెజార్టీలు వచ్చాయి. ఈ మెజార్టీలు చూస్తుంటే అసలు వైకాపా అనే పార్టీ ఒకటి ఉందా? అనే భావన వ్యక్తమవుతోంది. దాదాపు 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేదా? ఆ పార్టీ అంతగా చేతులెత్తేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2024 ఎన్నికల్లో శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏకపక్ష ఫలితాలు వచ్చాయని అనుకుంటే, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. అంటే, గతంతో పోలిస్తే వైకాపా మరింతగా క్షీణించిందా? అనే భావన వ్యక్తమవుతోంది.
కూటమి రిగ్గింగ్ చేసిందని, ఏకగ్రీవాలు చేసుకుందని, అధికారం, డబ్బులు ఉపయోగించి, పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచిందని వైకాపా నేతలు, కొందరు కార్యకర్తలు చెప్పుకున్నా, అది పాక్షిక నిజం మాత్రమే. రాయలసీమ, పల్నాడుల్లో ఒకట్రెండు చోట్ల అధికార కూటమి ఏకగ్రీవాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, రిగ్గింగ్ చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఎటువంటి గొడవలు, కక్షలు, బెదిరింపులు, ఏకగ్రీవాలు లేని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మధ్యాంధ్ర, పాక్షికంగా కొన్ని రాయలసీమ జిల్లాల్లో కూటమి ఏకపక్షంగా ఎలా గెలవగలిగింది? ఓటర్లు ఓట్లు వేయడం వల్లే.. అనేది ఫలితాలను బట్టి చెప్పవచ్చు.
వైకాపాకు సున్నానే..!
జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాల్లో ఈసారి అంతగా ఓటింగ్ జరగలేదు. అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినట్లు ఓటింగ్ శాతం ఉన్నట్లయితే, వైకాపాకు గుండుసున్నానే మిగిలేదనే విశ్లేషణలు వస్తున్నాయి.
వాస్తవానికి ఈసారి తటస్థులు, టీడీపీని అభిమానించే వర్గాల్లో కొందరు ఆ పార్టీపై అలకబూని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వారంతా కూడా ఓటింగ్‌కు వచ్చి ఉంటే వైకాపాకు ఈ మాత్రం ఓటింగ్ కూడా వచ్చేది కాదనే భావన ఉంది.
బిజెపి ఆపన్నహస్తం...!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీజేపీ మరోసారి ఆదుకుందనే భావన ఎన్నికల ఫలితాల తర్వాత వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న జగన్ పరువును కాస్తో కూస్తో బీజేపీ వల్ల నిలబెట్టుకోగలిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 13 నగరపాలక సంస్థల్లో ఆ పార్టీ కనీసం ఒకటి దక్కించుకుందంటే.. అది బీజేపీ వల్లే. బీజేపీ పోటీ చేసిన అనంతపురంలో వైకాపా స్వల్ప మెజార్టీతో గెలుపొందింది. ఇక్కడ కూటమి అభ్యర్థి ఓటమికి అనేక కారణాలు ఉన్నా... ప్రధానంగా బిజెపికి ఇవ్వడం వల్లే..ఇక్కడ వైకాపా గెలవగలిగింది.అక్కడ బీజేపీ కాకుండా టీడీపీ కానీ, జనసేన కానీ పోటీ చేస్తే.. నగరపాలక సంస్థల్లో వైకాపాకు గుండుసున్నానే మిగిలేది.
గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీనే జగన్ పరువును కాపాడింది. బలం లేకున్నా ఆరు పార్లమెంట్ స్థానాలు తీసుకున్న బీజేపీ, మూడు చోట్ల వైకాపా చేతిలో ఓడిపోయింది. ఈ మూడు స్థానాల్లో టీడీపీ కానీ, జనసేన కానీ పోటీ చేస్తే.. వైకాపాకు ఒక్క స్థానం మాత్రమే మిగిలేది. అయితే, అప్పుడు వైకాపా పరువు నిలిపిన బీజేపీ ఈసారి కూడా వారి పరువు నిలిపిందనే వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని, వైకాపా అధినేత వైఎస్ జగన్ తన ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలను, అకృత్యాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని, ముఖ్యంగా పట్టణ ప్రజలు అసలు మరిచిపోలేదని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.