ఏపీలో డేంజర్ హీట్వేవ్.. 46°C వరకు ఉష్ణోగ్రతలు, పిడుగులతో వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు తీవ్ర ఎండలు, వడగాల్పులు, పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
శనివారం పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అలాగే శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు.
మరోవైపు నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశముంది.
శుక్రవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.6 డిగ్రీలు, విజయనగరం జిల్లా రాజాంలో 43.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లోని 51 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
అధికారులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు వెంట తీసుకెళ్లాలని, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, గుండె, బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడరాదని సూచించారు.