ఏపీలోకి దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. 3 రోజుల పాటు వర్షాల హెచ్చరిక

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అమరావతి కేంద్రం వెల్లడించింది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, జూన్ 6 నాటికి నైరుతి రుతుపవనాలు కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని విస్తార ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. అలాగే తమిళనాడులోని చాలా ప్రాంతాలు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు కవర్ చేశాయి. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉండగా, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశమూ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పరిస్థితులు మరింత అనుకూలంగా మారి ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

మరోవైపు, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు.