మంటల్లో కాలి పోతున్న ఏపీ.. 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ Prakhar Jain సూచించారు. సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగవచ్చని హెచ్చరిస్తూ, అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.6 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.6, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 47.4, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, మార్కాపురం, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26 మండలాలు, ప్రకాశం జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 22, ఏలూరులో 21, బాపట్లలో 20 మండలాలు తీవ్రమైన ఎండ ప్రభావానికి గురయ్యాయి.
ఇక శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మే 22, 23 తేదీల్లో పల్నాడు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎండల తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారు ఎండలో తిరగరాదని హెచ్చరించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ కట్టుకోవడం, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.