ఏపీలో డబుల్ అలర్ట్.. పిడుగుల వర్షాలు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 44°C ఎండలు!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, జూన్ 7:
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణం ద్వంద్వ స్వరూపాన్ని ప్రదర్శించనుంది. ఒకవైపు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.

కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

పిడుగులు పడే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, పశుకాపరులు పొలాల్లో పనిచేసేటప్పుడు ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపిస్తే వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అలాగే ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.

ఇక మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా కొనసాగనుంది. సోమవారం రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 67 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

అలాగే కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్లో ప్రకాశం జిల్లా కారేడులో 43.5 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4 డిగ్రీలు, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 43.2 డిగ్రీలు నమోదయ్యాయి.

ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.