ఏపీ ప్రజలకు డబుల్ అలర్ట్.. పిడుగులతో వర్షాలు, 17 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు పలు ప్రాంతాల్లో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హోర్డింగ్స్ కింద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు, పశుకాపరులు ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
శనివారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో 51 మిల్లీమీటర్లు, కడప జిల్లా పెద్ద పసుపల్లెలో 45 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అలాగే వెన్నపూసపల్లె, ఉప్పలూరు, తొర్రివేముల, పొత్తిపాడు, కొమ్మిపాడు ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది.
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినా కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన్యం జిల్లా సీతంపేటతో పాటు పోలవరం జిల్లా చింతూరు, దేవిపట్నం, కూనవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, వరరామచంద్రాపురం మండలాలు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కృష్ణా జిల్లా ఘంటసాల, మొవ్వ, గుంటూరు జిల్లా కాకుమాను, పొన్నూరు, బాపట్ల జిల్లా బాపట్ల, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు.
శనివారం నంద్యాల జిల్లా సంజామలలో 41.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో 40.2 డిగ్రీలు, కర్నూలు జిల్లా బస్తిపాడు, మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప జిల్లా మంగపట్నంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వర్షాలు, పిడుగులు, వడగాల్పులు ఒకేసారి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.