బొత్స కన్నీళ్లకు కరగని ఓటర్లు...!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బొత్సకు ఊహించని పరాభవం ఎదురైంది. ఆయన సొంత ఇలాకాలో ఆయన కుమార్తె బొత్స అనూష ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా తన కుమార్తెను కూర్చోబెట్టాలన్న ఆయన కోరికను ఓటర్లు తిరస్కరించారు.

బొత్స తన ఇలాకా అయిన బొండపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి కుమార్తె అనూషను పోటీ చేయించారు. అయితే ఆమె ఈ ఎన్నికల్లో దాదాపు 5,136 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దీంతో బొత్స ఖంగుతిన్నారు. వైకాపాలో దాదాపు నంబర్ టూగా ఉన్న ఆయనకు ఈ ఓటమి కోలుకోలేని దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇటీవల ఆయన సొంత మేనల్లుడు చిన్నశీను వైకాపాను వదిలి టీడీపీలో చేరిన సందర్భంగా బొత్స పలుమార్లు బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన మేనల్లుడు తనను వీడిపోవడం తనను బాధించిందని ఆయన పలుమార్లు చెప్పుకున్నారు. అయితే చిన్నశీను వైకాపాను వీడిన అంశాన్ని ఆయన రాజకీయం చేసేందుకు, ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారని ఆయన ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. అయితే ఆయన ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా, ఎన్ని వ్యూహాలు రూపొందించినా ప్రజలు మాత్రం ఆయనను కనికరించలేదు.

రాజకీయ జీవితంలో చరమాంకానికి చేరిన బొత్స తన రాజకీయ వారసురాలిగా కుమార్తెను తొలిసారి ఎన్నికల్లో దించడం, ఆమె పరాభవం చెందడం బొత్సకు కోలుకోలేని దెబ్బే. స్థానిక ఎన్నికలకు ముందు బొత్స చాలా ఉత్సాహంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ముఖ్యంగా వెనుకబడిన విజయనగరం జిల్లాలో అది మరింతగా ఉందని, ఈ ఎన్నికల్లో తన కుమార్తెను జెడ్పీటీసీగా గెలిపించుకుని, మెజారిటీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించుకుందామని, తద్వారా కుమార్తెను జెడ్పీ ఛైర్మన్‌ను చేయాలని ఆయన ఆశించారు. అయితే ప్రజలు ఆయన ఆశలను అడియాసలు చేశారు.

రాజకీయ దురంధరుడు...!

ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్సకు రాజకీయ దురంధరుడు అనే పేరుంది. ఆయన రాజకీయ చాణక్యంతో ఎన్నో ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, తరువాత వైకాపాను గెలిపించారు. వైకాపాలో ఇప్పుడు ఆయన నంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి బొత్స తనకు తండ్రిలాంటివారని గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. జగన్ ఆ మాట అన్నప్పుడు బొత్స కన్నీళ్లు పెట్టుకుని అధినేతను ఆత్మీయంగా హత్తుకున్నారు. అప్పట్లో కన్నీళ్లు పెట్టుకున్న బొత్స తరువాత సందర్భం ఉన్నా లేకున్నా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఆయన కన్నీళ్లకు విజయనగరం ప్రజలేమీ కరిగిపోలేదు. తాజా ఫలితాలు అవే స్పష్టం చేస్తున్నాయి.

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు ముఖ్యమంత్రి పీఠం దాదాపుగా చేజిక్కినట్లే చేజిక్కి దూరమైంది. అయితే రాష్ట్రం విడిపోకుండా ఉండి ఉంటే ఆయన ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేవారని ఆయన అభిమానులు చెప్పుకుంటుంటారు. అప్పట్లోనే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కేదని, కానీ ఆయనకు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకపోవడంతో సోనియాగాంధీతో సరైన కమ్యూనికేషన్ చేయలేకపోయారని, దాంతో ముఖ్యమంత్రి పదవి చేజారిందంటారు.

ఇదంతా గతం. రాష్ట్రం విడిపోయిన తరువాత వైకాపాలో చేరిన ఆయన జగన్ ఐదేళ్ల కాలంలో కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు. అప్పట్లో జగన్‌ను మెప్పించడానికి ఆయన రాజధాని అమరావతిపై నీచమైన విమర్శలు చేశారు. అమరావతిని శ్మశానం అంటూ ఎద్దేవా చేశారు. జగన్, ఆయన మంత్రులు, ఆ పార్టీ చేసిన అరాచక, అకృత్య రాజకీయానికి 2024లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయితే ఓడి రెండున్నరేళ్లు అయినా వైకాపా నాయకులకు బుద్ధి రాకపోవడంతో ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజలు మరోసారి బుద్ధి చెప్పారు.

మొత్తం మీద... ఒకప్పుడు 'సొమ్ములు పోనాయి.. ఏటి సేత్తాం..' అన్న బొత్సకు ఇప్పుడు కుమార్తె ఓడిపోయిందంటే... 'ఏటి సేత్తాం' అని అమాయకంగా అంటారేమో?