ప్రతి తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ కాదు.. కానీ ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు: బ్రెయిన్ ట్యూమర్లు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశం ఉందని, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి. నరేన్ సూచించారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం లలితా హాస్పిటల్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు మూడు లక్షల కొత్త బ్రెయిన్ ట్యూమర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. భారతదేశంలో లక్ష మంది జనాభాకు 5 నుంచి 10 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వివరించారు. మెదడులో కణితి ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి ఎంఆర్‌ఐ ట్రాక్టోగ్రఫీ, కణితి స్వరూపాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు న్యూరో నావిగేషన్ గైడెడ్ బయాప్సీ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లాడుతూ ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ప్రజల్లో అవగాహన పెంచడానికి ముఖ్యమైన వేదికగా నిలుస్తోందన్నారు. బ్రెయిన్ ట్యూమర్ల ప్రారంభ లక్షణాలను గుర్తించడం, సమయానికి వైద్యులను సంప్రదించడం, బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మానసికంగా అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ముందస్తు నిర్ధారణ, బహుళ వైద్య నిపుణుల సమన్వయంతో కూడిన చికిత్స, ఆధునిక సాంకేతికత మరియు నిరంతర పరిశోధనల కారణంగా ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయని ఆమె తెలిపారు.

మరో న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూష మాట్లాడుతూ ప్రతి తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్‌గా భావించాల్సిన అవసరం లేదన్నారు. అయితే తలనొప్పితో పాటు చూపు మందగించడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట తడబడటం, తరచూ వాంతులు, మూర్ఛలు వంటి నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని బ్రెయిన్ ట్యూమర్లు క్యాన్సర్ కావని స్పష్టం చేశారు. మెనింజియోమా వంటి కొన్ని రకాల కణితులను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగిస్తే రోగులు సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే అనేక మంది రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని చెప్పారు.

మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి. శ్రావంతి మాట్లాడుతూ ప్రారంభ దశలో వ్యాధిని గుర్తిస్తే కేవలం శస్త్రచికిత్స ద్వారానే 90 నుంచి 95 శాతం వరకు విజయవంతంగా నయం చేయవచ్చని తెలిపారు. అయితే ఆలస్యంగా గుర్తించిన రోగులకు శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి అదనపు చికిత్సలు అవసరమవుతాయని హెచ్చరించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో 300 మందికి పైగా ప్రజలు, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించిన అనేక సందేహాలను వైద్యులు నివృత్తి చేశారు. వ్యాధిపై అవగాహన పెంచుకోవడం, లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచించారు.