"ఎడమ కాలు, చెయ్యి పూర్తిగా పడిపోయాయి.. సర్జరీ తర్వాత మళ్లీ నడుస్తున్న యువకుడు"

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు: అధిక రక్తపోటు (హై బీపీ) కారణంగా మెదడులో రక్తనాళం చిట్లి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 38 ఏళ్ల యువకుడికి గుంటూరులోని లీలా కార్తికేయ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం ప్రసాదించారు. ప్రస్తుతం ఆ రోగి సాధారణంగా నడవగలుగుతున్నాడని ఆస్పత్రి చైర్మన్, సీనియర్ చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ వేమూరి నాగ శంకర్ తెలిపారు.

తెనాలి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన డి. శ్రీకాంత్ (38) మే 11న ఉదయం అకస్మాత్తుగా ఎడమ కాలు, ఎడమ చెయ్యి పనిచేయకపోవడంతో పాటు పలుమార్లు వాంతులు చేసుకుంటూ గుంటూరులోని లీలా కార్తికేయ హాస్పిటల్స్‌కు చేరుకున్నాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ నాగ శంకర్, శ్రీకాంత్‌కు 160/100 స్థాయిలో అధిక రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు.

పరీక్షల్లో హైపర్‌టెన్సివ్ ఇంట్రా సెరిబ్రల్ బ్లీడ్ కారణంగా మెదడులో కుడివైపు రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగినట్లు తేలింది. దీని ప్రభావంతో ఎడమ కాలు, ఎడమ చెయ్యి పూర్తిగా పనిచేయకుండా పోయాయి.

మొదట మందులు, ప్రత్యేక ఇంజెక్షన్ల ద్వారా చికిత్స అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేపట్టారు. తలకు కుడివైపున చిన్న రంధ్రం చేసి, మెదడులో పేరుకుపోయిన రక్తాన్ని బయటకు తొలగించారు. దీంతో మెదడుపై ఒత్తిడి తగ్గి రోగి క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు.

శస్త్రచికిత్సకు ముందు చేతి, కాలి కదలికలు దాదాపు పూర్తిగా కోల్పోయిన శ్రీకాంత్‌లో ప్రస్తుతం 80 శాతం వరకు శక్తి తిరిగి వచ్చిందని డాక్టర్ నాగ శంకర్ తెలిపారు. నడవలేని పరిస్థితి నుంచి స్వయంగా నడిచే స్థితికి చేరుకోవడం వైద్యపరంగా గొప్ప విజయమని పేర్కొన్నారు.

శ్రీకాంత్‌ను రెండు వారాలపాటు ఆస్పత్రిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో మే 25న డిశ్చార్జ్ చేశారు.

తన ప్రాణాలను కాపాడి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ వేమూరి నాగ శంకర్‌కు శ్రీకాంత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హై బీపీని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ నాగ శంకర్ సూచించారు.