క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం.. డాక్టర్ ప్రియదర్శిని హెచ్చరిక!
గుంటూరులో నిర్వహించిన ఆరోగ్య సభలో క్యాన్సర్ వ్యాధిపై ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ పి. ప్రియదర్శిని కీలక సూచనలు చేశారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తొలి దశలోనే గుర్తిస్తే ఆధునిక వైద్యంతో పూర్తిగా నయం చేసే అవకాశాలు పెరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.
క్యాన్సర్ అంటే భయం కాదు.. అవగాహన అవసరం
స్థానిక అవగాహన సంస్థ కార్యాలయంలో “క్యాన్సర్ వ్యాధి – అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సా విధానాలు” అంశంపై జరిగిన ఆరోగ్య సభలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ బారిన పడినవారు మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ వంటి ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు
మహిళల్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయని డాక్టర్ ప్రియదర్శిని పేర్కొన్నారు. ఛాతీలో చిన్న గడ్డ కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మెమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అలాగే 11 సంవత్సరాలు నిండిన యువతులు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకుంటే 80 శాతం వరకు ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి
మూత్ర విసర్జనలో నొప్పి, రక్తం రావడం, చీము కనిపించడం, మూత్రం ఆగి ఆగి రావడం, మల విసర్జనలో రక్తం పడటం, చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. పాప్ స్మియర్, పీఎస్ఏ, బోన్ మారో, పెట్ స్కాన్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చన్నారు.
ప్లాస్టిక్ వాడకం కూడా ప్రమాదమే!
రోజువారీ జీవితంలో అధికంగా ప్లాస్టిక్ వినియోగం, ఫుడ్ కలర్స్, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్లి పలు రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని తెలిపారు.
ముందస్తు పరీక్షలతోనే రక్షణ
శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సకాలంలో నిర్ధారణ, సరైన చికిత్సతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ చక్ర పిఆర్వో షేక్ మస్తాన్ వలి, టీవీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.