వాస్తవ బలం తేల్చుకునేందుకేనా.. చంద్రబాబు, లోకేష్‌ల వ్యూహం?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ప్రత్యక్ష ఎన్నికలతో బలాబలాలు తేలేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌బోతోంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన రెండేళ్ల త‌రువాత ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌గ‌ర కార్పొరేష‌న్ల‌కు మేయ‌ర్లు, మున్సిపాల్టీల‌కు ఛైర్మ‌న్ల‌ను ప్ర‌త్య‌క్షంగా ఎన్నుకోబోతున్నారు. అంటే.. రాజ‌కీయ పార్టీల చిహ్నాల‌తోనే ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. గ‌తంలో మేయ‌ర్లు, ఛైర్మ‌న్ల ఎన్నిక ప‌రోక్షంగా జ‌రిగేది. మెజార్టీ కార్పొరేట‌ర్లు, మెజార్టీ వార్డు మెంబ‌ర్లు ఎవ‌రిని మేయ‌ర్‌గా ఎన్నుకుంటే.. వారు మేయ‌ర్‌, ఛైర్మ‌న్లు అయ్యేవారు. అయితే.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం న‌గ‌ర మేయ‌ర్లు, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ల‌ను ప్ర‌త్య‌క్షంగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొస్తోంది. దీని ద్వారా రాజ‌కీయ పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటో తేలిపోతాయి. అయితే.. ఇది అధికారంలో ఉన్న రాజ‌కీయ పార్టీల‌కు పెద్ద రిస్క్‌. ఎందుకంటే.. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడిస్తే.. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దీని ప్ర‌భావం త‌ప్ప‌కుండా క‌నిపిస్తుంది.

గత ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఒక హెచ్చరిక

దీనికి ఒక ఉదాహ‌ర‌ణ చెప్పుకోవ‌చ్చు. రాష్ట్రంలో 2024 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఓట‌మి చెంద‌డం.. ఆ త‌రువాత జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపింది. అంతేనా.. అది అప్ప‌టి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఒక ర‌కంగా లిట్మ‌స్ టెస్ట్‌గా భావించ‌వ‌చ్చు. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆ ఓట‌మిని త‌క్కువ చేసి చూపించేందుకు, త‌మ ఓట‌ర్లు వేరే ఉన్నారంటూ.. త‌మ బ‌లం వేరే అంటూ.. వాస్త‌వాల‌ను ఒప్పుకునేందుకు అంగీక‌రించ‌లేదు. అయితే.. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌మీక్ష చేసుకుని, ఎందుకు ఓడిపోయామో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుని ఉంటే.. జ‌గ‌న్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయి ఉండేది కాదేమో. జ‌గ‌న్ కాకుండా వేరే వారు అధికారంలో ఉంటే.. అంత ఘోరంగా మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుని, పాల‌న‌లో లోపాల‌ను నివారించేందుకు, ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసి ఉండేవారేమో. కానీ.. జ‌గ‌న్‌కు ఆ ఆలోచ‌న లేక‌పోవ‌డంతో త‌రువాత ఘోరంగా ఓడిపోయార‌నే అభిప్రాయం ఉంది.

ప్రత్యక్ష ఎన్నికలతో జవాబుదారీతనం

స్థానిక ఎన్నిక‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా నిర్వ‌హించ‌డం వ‌ల్ల జ‌రిగే మేలు కూడా ఇదే. అంతే కాకుండా.. త‌మ న‌గ‌ర మేయ‌ర్‌, ప‌ట్ట‌ణ ఛైర్మ‌న్ల‌ను నేరుగా ప్ర‌జ‌లు ఎన్నుకుంటే.. స‌ద‌రు ఎన్నికైన వ్య‌క్తులు ఓట‌ర్ల‌కు జ‌వాబుదారీగా ఉంటారు. పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌ను ఆశించ‌డం, మెరుగైన న‌గ‌రాల‌ను, ప‌ట్ట‌ణాల‌ను రూపొందించుకోవ‌డానికి ఇటువంటి ప‌ద్ధ‌తి అవ‌స‌రం కూడా. అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక చోట్ల త‌మ న‌గ‌ర మేయ‌ర్ల‌ను ఇలానే ఎన్నుకుంటారు. అయితే.. చంద్ర‌బాబు అండ్ కో ఇప్పుడు ఈ ప‌ద్ధ‌తిని ఎందుకు ఎంచుకున్నార‌నే దానిపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కూటమి పాలనపై అసంతృప్తి ఉందా..?

వాస్త‌వానికి కూట‌మి ప్ర‌భుత్వం బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల త‌రువాత ప్ర‌జ‌ల్లో కూట‌మి పాల‌న‌పై అంత సంతృప్తి లేద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. ఒక ర‌క‌మైన నిర్వేదం, నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అధికారంలో ఉన్న‌వారు.. వారి చుట్టూ ఉన్న‌వారు త‌ప్ప మిగ‌తావారు.. ఈ పాల‌న‌తో బాగున్నామ‌నే మాట‌ను వ్య‌క్తం చేయ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా స్వంత పార్టీ వారే.. ఈ ర‌క‌మైన అభిప్రాయంతో ఉన్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యంగా మారింది. అయితే.. గ‌త పాల‌న‌తో పోల్చుకుంటే.. ఫ‌ర్వాలేద‌నే భావ‌న కూడా ఉంది. అయితే.. గ‌త పాల‌కులు రాక్ష‌సులు.. వారి కంటే.. మేమే న‌యం.. అని ప్ర‌స్తుత పాల‌కులు చెప్పుకుంటున్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

పెట్టుబడులు.. సంక్షేమం.. అసంతృప్తి

2024లో అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, అభివృద్ధి అంటూ ప‌రుగులు పెడుతోంది. అక్క‌డ ల‌క్ష కోట్ల పెట్టుబ‌డి వ‌చ్చింది.. ఇక్క‌డ ఇంకేదో వ‌చ్చిందంటూ.. రోజుకో క‌బురు చెప్పుకుంటూ పోతున్నారు. అదే స‌మ‌యంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఈ సంక్షేమ ప‌థ‌కాల్లో మెజార్టీ ప‌థ‌కాలు.. ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఓటు వేసేవారికి కూడా ద‌క్కుతున్నాయ‌నేది వాస్త‌వం. స‌రే.. ప్ర‌జ‌ల్లో ఇలా వాళ్లూ.. వీళ్లూ.. అని విడ‌దీయ‌లేమ‌నుకున్నా.. స్వంత పార్టీ వారికి ఏమీ ద‌క్క‌లేద‌నే అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంద‌నే చ‌ర్చ ఉంది. ఒక‌వైపు ఎప్పుడో ఫ‌లితాలు ఇచ్చే పెట్టుబ‌డులు.. మ‌రోవైపు సంతృప్తిక‌ర‌మైన సంక్షేమం లేద‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అవినీతి ప్రచారం.. ప్రభుత్వంపై ప్రభావం?

ఇది ఇలా ఉంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, వారి బంధుగ‌ణం ఇష్టారాజ్యంగా అవినీతికి, దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఎవ‌రు ఎంతెంత తింటున్నారు.. ఎంతెంత దోచుకుంటున్నార‌నేది తెలియ‌క‌పోయినా.. అవినీతి అనే ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. కీల‌క నేత‌లు కూడా అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ స్వంత పార్టీ నేత‌లే వ్యాఖ్యానించ‌డం, ప్ర‌చారం చేస్తుండ‌డంతో.. పాల‌న‌పై ప్ర‌జ‌లు సంతృప్తిగా లేర‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఈ వాద‌న‌ను అంగీక‌రించ‌డం లేదు. తాము అభివృద్ధి, సంక్షేమాన్ని స‌మ‌తూకంగా చేస్తున్నామ‌ని, పోల‌వ‌రం, రాజ‌ధాని అమ‌రావ‌తి, ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌ను రాష్ట్రానికి తెస్తున్నామ‌ని, అదే స‌మ‌యంలో సంక్షేమంలో సూప‌ర్‌సిక్స్‌ను అమ‌లు చేస్తున్నామ‌ని, గ‌తంలో జ‌గ‌న్ ఇచ్చిన దానిక‌న్నా ఎక్కువ ఇస్తున్నామ‌ని.. ఇక ప్ర‌జ‌ల‌కు త‌మ‌పై అసంతృప్తి ఎందుకు ఉంటుందంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

రాష్ట్రాన్ని జ‌గ‌న్ నాశ‌నం చేశార‌ని, తాము బాగు చేస్తున్నామ‌ని, ఫ‌లితాలు రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వంపై జ‌రుగుతోన్న ప్ర‌చారానికి విరుగుడుగా స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించి కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంటే.. త‌మ‌పై జ‌రుగుతోన్న ప్ర‌చారం ఆగిపోతుంద‌నే భావ‌న పార్టీ పెద్ద‌ల్లో ఉన్న‌ట్లుంది.

100 మున్సిపాల్టీలు.. 60-70 టార్గెట్‌?

ఇప్పుడు జ‌ర‌గ‌బోయే సుమారు 100 మున్సిపాల్టీల్లో క‌నీసం 60 నుంచి 70 మున్సిపాల్టీల‌ను కూట‌మి గెలుచుకుంటే.. త‌మ బ‌లం త‌గ్గ‌లేద‌ని, మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామ‌ని చెప్పుకోవ‌డానికి, ప్ర‌భుత్వంపై జ‌రుగుతోన్న ప్ర‌తికూల ప్ర‌చారాన్ని త‌గ్గించ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే భావ‌న వారిలో ఉండ‌వ‌చ్చు. ఒక‌వేళ తాము అనుకున్న విధంగా ఫ‌లితాలు రాక‌పోతే.. అప్పుడు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌నే ఆలోచ‌న కూడా వారిలో ఉండొచ్చు.

మూడేళ్ల సమయం.. దిద్దుబాటుకు అవకాశం

వాస్త‌వానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో మూడేళ్ల స‌మ‌యం ఉంది. ఇప్పుడు క‌నుక ప్ర‌జ‌లు త‌మ పార్టీని తిర‌స్క‌రిస్తే.. ఇక పూర్తిగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వ‌దిలేసి, సంక్షేమం వైపు దృష్టి పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న కూడా ఉండ‌వ‌చ్చు. అంటే.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక ర‌కంగా ముంద‌స్తు హెచ్చ‌రిక‌గా ప‌నిచేస్తాయ‌నే భావ‌న కూడా క‌నిపిస్తోంది.

కూటమికి మినీ లిట్మస్ టెస్ట్‌?

మొత్తం మీద.. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా త‌మ వాస్త‌వ బ‌లం తేల్చుకోవ‌డానికి, త‌ద్వారా రాబోయే కాలంలో ప్ర‌భుత్వ పాల‌న‌లో మెరుగులు దిద్దుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఈ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు అధికార ప‌క్షానికి ఎంత వ‌ర‌కు లాభిస్తాయి..? ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి నిజంగానే ఉందా..? లేక ప్ర‌చారానికే ప‌రిమిత‌మా..? అన్న‌ది ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలే తేల్చ‌నున్నాయి. ఒక‌వేళ కూట‌మి అనుకున్న స్థాయిలో విజ‌యం సాధిస్తే.. అది ప్ర‌భుత్వానికి పెద్ద ఊర‌ట‌. అదే స‌మయంలో అంచ‌నాల‌కు భిన్నంగా ఫ‌లితాలు వ‌స్తే.. మ‌రో మూడేళ్ల పాల‌న‌లో దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఏర్ప‌డుతుంది. అందుకే.. రాబోయే స్థానిక ఎన్నిక‌లు కేవ‌లం మేయ‌ర్లు, ఛైర్మ‌న్ల‌ను ఎన్నుకునే ఎన్నిక‌లు మాత్ర‌మే కాకుండా.. కూట‌మి ప్ర‌భుత్వానికి ఒక ర‌క‌మైన మినీ లిట్మ‌స్ టెస్ట్‌గా మార‌బోతున్నాయ‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది.