రైతులకు గుడ్న్యూస్.. 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ
రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని వెల్లడించారు.
రబీ ధాన్యం కొనుగోళ్లలో రికార్డు
రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సీజన్లో 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 19.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 18 శాతం అధికమని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.4,600 కోట్లు 24 గంటల్లోనే జమ చేసినట్లు వెల్లడించారు.
1010, PR 126 వరి రకాలపై ఆందోళన
ఎన్టీఆర్ జిల్లాలో 1010, PR 126 వంటి అప్రాధాన్య వరి రకాలను అధికంగా సాగు చేయడం వల్ల బ్రోకెన్ రైస్ సమస్య పెరిగిందని మంత్రి తెలిపారు. సాధారణ వరి రకాలలో 20-25 శాతం బ్రోకెన్ రైస్ వస్తే, ఈ రకాలలో 45-50 శాతం వరకు వస్తోందని చెప్పారు. అయినప్పటికీ రైతులను నిరాశపరచకుండా ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తోందన్నారు.
గన్ని బ్యాగుల సమస్యకు ప్రత్యామ్నాయం
ప్రతి సీజన్లో గన్ని బ్యాగుల కొరత సమస్య వస్తోందని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ అంశంపై త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో 8.93 కోట్ల గన్ని బ్యాగులు సిద్ధం చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సమస్య కొనసాగుతోందన్నారు.
ధాన్యం రవాణాలో GPS విధానం
ధాన్యం రవాణాలో పారదర్శకత కోసం 18 వేల వాహనాలను GPS సిస్టంతో అనుసంధానం చేసినట్లు మంత్రి వెల్లడించారు. చిన్న రైస్ మిల్లర్లకు ఇబ్బందులు లేకుండా బ్యాంకు గ్యారంటీల విషయంలో 1:3 విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గ్యాస్ డెలివరీలపై కఠిన చర్యలు
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరాలో జాప్యాలు కొనసాగుతున్నాయని మంత్రి అంగీకరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1.83 లక్షల గ్యాస్ బుకింగ్స్కు 1.89 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ బంకుల్లో డ్రై అవుట్ పరిస్థితి లేదని, 21 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.