జగన్‌కో అవకాశం.. నేతలను నమ్మితే అంతే..!?
ప్రత్యక్ష ఎన్నికలతో వైకాపాకు కొత్త ఆశలు
త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి ఒక బ్రహ్మాండమైన అవకాశం లభించబోతోంది. నగర మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుందని కూటమి ప్రభుత్వం ప్రకటించడం వైకాపాలో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కొన్ని మున్సిపల్ స్థానాలనైనా గెలుచుకుంటే.. ఆ పార్టీకి జవ, జీవాలు లభిస్తాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమికి గురై.. చివరకు ప్రతిపక్ష హోదా కరవై.. ప్రతిపక్ష హోదా ఇవ్వండంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూ.. 11 అంటూ.. అవమానాల పాలవుతోన్న వైకాపాకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు. అభాసుపాలైన ఆ పార్టీకి ఇప్పుడు ఈ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా బలం నిరూపించుకునేందుకు, తద్వారా భవిష్యత్తుపై ఆశలను పెంచుకునేందుకో స్వర్ణావకాశం దక్కనుంది.
కూటమికి మళ్లీ అదే ఫీట్ సాధ్యమేనా..?
రెండున్నరేళ్ల క్రితం కనీవినీ ఎరుగని మెజార్టీలతో, స్థానాలతో.. అధికారంలోకి వచ్చిన కూటమి ఈ రెండేళ్ల పాలన తరువాత తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు దిగబోతోంది. ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ అటువంటి ఫీట్ చేయడం దాదాపు అసాధ్యమే. ఇప్పుడు జరగనున్న దాదాపు 100 మున్సిపాల్టీలో కూటమి 90 శాతం మున్సిపాల్టీలను గెలిస్తేనే వారు ప్రజల మన్ననలను పొందుతున్నట్లు. అలా జరిగే పరిస్థితులు కనిపించకపోవడం.. వైకాపాకు అనుకూలమైన అంశం.
ఇప్పుడు జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో వైకాపా కనీసం 30 నుంచి 40 మున్సిపాల్టీలను గెలుచుకుంటే.. ఆ పార్టీ పుంజుకుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలనలో ఎవరూ సంతృప్తికరంగా లేరని, అవినీతి, ఆశ్రితపక్షపాతం, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
కూటమిపై అసంతృప్తి.. వైకాపాకు కలిసొస్తుందా?
జగన్ ఉన్నప్పుడే తాము బాగున్నామని జనం చెబుతున్నారని, మళ్లీ జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలే ఎదురు చూస్తున్నారని వారు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా.. వైకాపా నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు మాత్రం ప్రజలంతా కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.
జగన్ ఉంటే సంక్షేమ పథకాలు బాగా అందేవని, ఇప్పుడు అవి అందడం లేదని, ఆయనొస్తే.. బాగుండని వారు అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ప్రచారం చేస్తున్నారని కాదు కానీ.. కొన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
30 మున్సిపాల్టీలు గెలిస్తే..?
ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా జరిగే ఎన్నికల్లో జగన్ పార్టీ కనీసం 30 మున్సిపాల్టీలను గెలుచుకున్నా.. అదీ తనకు అంతగా పట్టులేని అర్బన్ ప్రాంతంలో జరిగితే.. వైకాపాకు వచ్చే ఎన్నికలు నల్లేరుపై నడకే. అందుకే.. ఇప్పుడు జగన్‌కు ఓ అవకాశం వచ్చిందని చెప్పడం. అయితే.. ఇది అంత సులువైన విషయమేమీ కాదు.
జగన్ ఇచ్చినట్లు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోన్న మాట నిజం. అయితే.. దీని వల్లే ఓట్లు వస్తాయా.. అంటే సమాధానం చెప్పడం కష్టం. జగన్‌కు వీళ్లకు తేడా లేదనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే ప్రచారం.. కీలక నేతలు కూడా సొమ్ములు కూడబెట్టుకుంటున్నారనే ప్రచారం కూడా వైకాపాకు కలిసివచ్చేది.
ఓట్లు తెచ్చే యంత్రాంగం ఉందా?
అయితే.. ప్రజల్లో వైకాపాకు సానుకూలత పెరిగినా.. ఆ సానుకూలతను ఓట్లుగా మార్చే యంత్రాంగం వైకాపాకు లేదనేది ఆ పార్టీ వర్గాల భావన. ఎన్నికలు జరిగే 100 మున్సిపాల్టీల్లో జగన్ పార్టీ మూడు నాలుగు తప్ప అన్నిచోట్ల ఎమ్మెల్యేలుగా ఓడిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ తరఫున అక్కడ ఇన్‌ఛార్జిలుగా పనిచేస్తున్నవారు.. ఈ ఎన్నికలను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా?
మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌గా ఎంపిక చేసిన వ్యక్తికి ఇన్‌ఛార్జిగా ఉన్న నాయకుడు సహకరిస్తారా? మేయర్‌గా తన పార్టీ అభ్యర్థి గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన తనకు పోటీ అవుతారనే భావన ఇన్‌ఛార్జిగా ఉన్న నాయకుడికి ఉంటుంది. తద్వారా.. ఆ మేయర్ లేదా ఛైర్మన్‌ను ఓడించడానికి వీళ్లు యత్నిస్తారనే భావన ఉంది.
నేతలే బలహీనతగా మారితే..?
అదీ కాకుండా వైకాపాకు చెందిన కొందరు నాయకులపై ఇప్పటికీ ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఉదాహరణకు గుంటూరు పట్టణాన్ని తీసుకుంటే.. అక్కడ ప్రజలు వైకాపాకు మద్దతు ఇస్తున్నారని భావించినా.. అంబటి రాంబాబు, అప్పిరెడ్డి వంటి నేతలను చూసి ఓట్లు వేస్తారా..? అనే ప్రశ్నలు స్వంత పార్టీ నుంచే వ్యక్తం అవుతున్నాయి.
ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులను వదిలేసి ఇటువంటి పేపర్‌టైగర్లకు పెత్తనం అప్పగిస్తే.. పార్టీకి మళ్లీ పోయినసారి వచ్చిన ఫలితాలే వస్తాయని కొందరు వైకాపా నాయకులు అంటున్నారు.
జగన్ ఏం చేస్తారో చూడాలి..!
మొత్తం మీద కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఇక విజయం తమదే అని భావించే జగన్‌కు చంద్రబాబు అండ్ కో ఓ అవకాశాన్ని ఇచ్చారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి..?