పలమనేరు యువతకు గుడ్ న్యూస్.. స్కిల్ సెంటర్‌పై ఎమ్మెల్యే కీలక హామీ

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పలమనేరు, జూన్ 27: పలమనేరు ప్రాంత యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో సీడాప్ నిర్వహించిన జాబ్ మేళాలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు మూడు రాష్ట్రాల కూడలిగా ఉండటంతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో రూ.250 కోట్ల అంచనాతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం 2018లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశామని గుర్తు చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం పలమనేరు ప్రాంతానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చించి ఈ కేంద్రం ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. పరిశ్రమలు పెరిగితేనే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అందుకే స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని యువత విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

జాబ్ మేళా కేవలం ఉద్యోగ అవకాశాల కల్పనకే పరిమితం కాకుండా యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డీఎస్డీవో గుణశేఖర్ రెడ్డి, వేర్‌హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.