SC, BC హాస్టళ్లపై కలెక్టర్ బిగ్ అలర్ట్.. 100% అడ్మిషన్లు తప్పనిసరి!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

భీమవరం, జూన్ 27: పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్లు సాధించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్‌లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి విద్యార్థి చదువుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు (హెచ్‌డబ్ల్యూ‌వోలు) క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ హాస్టళ్లలో చేరికలు పెంచాలని సూచించారు.

శనివారం ఎస్సీ, బీసీ వసతి గృహాల అధికారులతో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వసతి గృహాల్లో విద్యార్థుల చేరికలు, మౌలిక సదుపాయాలు, విద్యా వాతావరణం, సంక్షేమ పథకాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హాస్టళ్లలో దశలవారీగా మౌలిక వసతులు మెరుగుపరిచామని తెలిపారు. ఇప్పటికే సోలార్ లైట్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు సోలార్ హీటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్య అనేది ప్రతి కుటుంబ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి చిన్నారి విద్యను పూర్తిచేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ముఖ్యంగా 7, 8, 9 తరగతులలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రాప్‌అవుట్‌లను పూర్తిగా నివారించి ప్రతి విద్యార్థిని పాఠశాలలో కొనసాగించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

వేములదీవి, వీరవాసరం, పాతపాడు, రేలంగి, ఉండి, కాళీపట్నం తదితర ప్రాంతాల్లోని బీసీ ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల చేరికలు తక్కువగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని హెచ్‌డబ్ల్యూ‌వోలకు ఆదేశించారు.

ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి, మెస్ చార్జీలు, ఇతర సంక్షేమ సౌకర్యాలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించి ప్రభుత్వ హాస్టళ్లపై ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి విద్యార్థి హాస్టల్‌లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే బీసీ, ఎస్సీ పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థుల అడ్మిషన్లను కూడా పెంచాలని సూచించారు. గత విద్యాసంవత్సరంలో హాస్టళ్లలో చదివిన పలువురు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందడం ప్రభుత్వ హాస్టళ్ల నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలు చదువు మధ్యలో ఆగిపోకుండా, వారికి వసతి గృహాల ద్వారా పూర్తి భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. విద్య ద్వారానే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి. అరుణ కుమారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి. సూరిబాబు, హెచ్‌డబ్ల్యూ‌వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.