సాక్షి వార్తపై ఏబీ ఫైర్.. “పచ్చి అబద్ధాలు అచ్చేస్తారా?”

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

సాక్షి అత్యుత్సాహం.. తిరిగి కొట్టిన వ్యవహారం

ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రభుత్వంపై పలు విమర్శలు, ఆరోపణలతో దండెత్తుతున్న రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో సాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి ఘోరంగా దెబ్బతింది.

కూటమి ప్రభుత్వంపై ఏబీ వెంకటేశ్వరరావు చేస్తోన్న విమర్శలు, ఆరోపణలతో..ఆయనను వాడుకోవాలనే తలంపుతో...చేసిన ఓ పని వారికే తిరిగి కొట్టింది. ప్రభుత్వానికి ఏబీ వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయన పేరు మీద పచ్చి అబద్దాలు అచ్చేసి జనం మీదకు వదలాలి అనుకున్న సాక్షికి ఏబీ వెంకటేశ్వరరావు షాక్ ఇచ్చారు.

ఏబీ పేరుతో సాక్షి సంచలన కథనం

ఈ రోజు సాక్షి పత్రికలో ఆయన అన్నారని ప్రచురించిన వార్తపై ఆయన ఆ పత్రిక ఎడిటర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. తాను అనని మాటలను అన్నారని, ఇలా చేయడానికి సిగ్గులేదా..అంటూ..ఆయన ఆ పత్రికపై ధ్వజమెత్తారు.

అయితే..అసలు సంగతి ఏమిటంటే..ఈరోజు సాక్షి పత్రికలో “మీ కంటే వై.ఎస్‌.జ‌గ‌న్ పాలన వందరెట్లు బెటర్” అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారంటూ సాక్షి మొదటి పేజీలో ఒక వార్తను ప్రచురించింది. అంతే కాకుండా ఇంకా ఇలా రాసింది. “ఇది ప్రజలే చెబుతున్నారు. ప్రజల ఆస్తి లాక్కుంటున్న నీకు పాలాభిషేకం చేయమంటావా? నారా లోకేష్‌పై నిప్పులు చెరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. నవులూరి రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై మండిపాటు, ఎవరి శవాలపై రాజ్యం ఏలాదామనుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం...” అంటూ ఆ వార్తను అచ్చేశారు.

“నేను అనని మాటలను అన్నానని ఎలా రాస్తారు?”

అయితే..ఈ వార్తపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. “తాను అనని మాటలను అన్నానని వార్త ప్రచురిస్తారా..? పచ్చి అబద్దాలను అచ్చేస్తారా” అంటూ ఆయన ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఒక ఘాటు లేఖ రాశారు.

వీడియో లింక్‌తో ఏబీ కౌంటర్

తాను నవులూరులో చేసిన వ్యాఖ్యల వీడియో లింక్‌ను పోస్టు చేస్తూ..“మీలో ఇంకా పాత్రికేయ విలువలు మిగిలి ఉంటే చేసిన తప్పును సరిచేసుకోండి. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉండాలనే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టి ప్రతి చిన్నవిషయానికి, విమర్శలకు కేసులు పెట్టను, కానీ మాట్లాడే స్వేచ్ఛ అంటే అబద్దాలను చెప్పడానికి స్వేచ్ఛ కాదు” అంటూ ఆయన ఆ లేఖలో ధ్వజమెత్తారు.

“జగన్ నెవర్ ఎగైన్”.. ఏబీ కీలక వ్యాఖ్యలు

అంతేనా..వై.ఎస్‌.జ‌గ‌న్ పాలన ఎంత అధ్వాన్నమో..రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్లందరి కంటే నాకు ఇంకా బాగా తెలుసు..అందుకే తాను “జగన్ నెవర్ ఎగైన్” అనే నినాదంతో రాజకీయాల్లో వచ్చానని..తన పేరుతో ఇలాంటి వార్తలు రాస్తే బాగుండదంటూ..తీవ్రంగా సాక్షి ఎడిటర్‌ను ఆయన ఆ లేఖలో హెచ్చరించారు.

“తప్పును సరిచేసుకోండి” అంటూ హెచ్చరిక

“మీకేమైనా పాత్రికేయ విలువలు ఉంటే చేసిన తప్పును సరిచేసుకోండి” అంటూ లేఖను ముగించారు.