“ఉండవల్లి” ఆరాటం...పోరాటం..ఇకనైనా ఆగుతుందా..!?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

సుప్రీంకోర్టులో “ఉండవల్లి”కి ఎదురుదెబ్బ

ఈనాడు సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు, స్వ‌ర్గీయ చెరుకూరి రామోజీరావును అవినీతిప‌రుడు, ప్ర‌జ‌ల సొమ్మును కాచేసే మోస‌గాడిగా నిరూపించాల‌ని ఏళ్ల త‌ర‌బ‌డి పోరాటం చేస్తోన్న రాజ‌మండ్రి మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు ఉండ‌వ‌ల్ల అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మార్గ‌ద‌ర్శి ఫైనాన్సియ‌ర్స్‌పై ఉండ‌వ‌ల్లి సుధీర్ఘ న్యాయ‌, రాజ‌కీయ పోరాటం చేస్తున్నారు. నిబంధన‌ల‌కు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేక‌రించార‌ని, ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకే ఆయ‌న ఇలా చేశారంటూ ఉండ‌వ‌ల్లి పోరాటం చేస్తున్నారు.

వైఎస్‌ ఆశీస్సులతో మొదలైన పోరాటం

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సూచ‌న‌ల‌తో, ఆశీస్సుల‌తో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఈ పోరాటాన్ని ప్రారంభించారు. 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం, ముఖ్య‌మంత్రిగా వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన ద‌గ్గ‌ర నుంచి ఏదో విధంగా రామోజీరావును లొంగ‌దీయాల‌ని, ఆయ‌న అవినీతిప‌రుడు, మోస‌గాడు అని నిరూపించాల‌నే ధ్యేయంతో ఈ ద్వ‌యం సుధీర్ఘంగా ప్ర‌య‌త్నాలను చేసింది.

‘పెద్ద‌లా.. గ‌ద్ద‌లా..’ వార్తతో మొదలైన విభేదాలు

వై.ఎస్‌. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ అవుట‌ర్‌రింగ్‌రోడ్డు విష‌యంలో ఈనాడులో వ‌చ్చిన పెద్ద‌లా..గ‌ద్ద‌లా.. వార్త అప్ప‌టి ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని క‌ల‌వ‌ర‌పెట్టింది. దీంతో..త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న రామోజీరావును లొంగ‌దీసేందుకు అప్పుడు పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ను రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఎగ‌దోశారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆదేశాల‌తో..రంగంలోకి దిగిన ఉండ‌వ‌ల్లి అప్ప‌టి నుంచి రామోజీరావును అవినీతిప‌రుడుగా, మోస‌గాడిగా చిత్రిక‌రీంచేందుకు ఆప‌సోపాలు ప‌డుతున్నారు.

మార్గదర్శి డిపాజిట్లపై న్యాయపోరాటం

ఈ పోరాటంలో మార్గ‌ద‌ర్శి విష‌యంలో కొన్ని నిబంధ‌ల‌ను రామోజీరావు అతిక్ర‌మించాడ‌ని, చ‌ట్ట‌విరుద్ధంగా సేక‌రించిన నిధుల‌ను వెంట‌నే వెన‌క్కు ఇచ్చేయాల‌ని అప్ప‌ట్లో కోర్టులు పేర్కొన్నాయి. దీంతో..రామోజీరావు..తాను సేక‌రించిన నిధుల‌ను వెంట‌నే అణాపైసాతో స‌హా వెన‌క్కు ఇచ్చేశారు. ఎవ‌రెవ‌రి డిపాజిట్లు ఉన్నాయో..వారంద‌రికీ డిపాజిట్లు వెన‌క్కు ఇచ్చేశారు. చ‌ట్ట‌నిబంధ‌న‌ల‌ను ఆయ‌న పాటించ‌లేద‌నే సంగ‌తి అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్రజల్లో ఆందోళన రేకెత్తలేదనే వాదన

అయితే..ఆయ‌న మోస‌గాడు, అవినీతిప‌రుడని ఎవ‌రూ అప్ప‌ట్లో భావించ‌లేదు...ఇప్ప‌టికీ భావించ‌డం లేదు. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ఆయ‌న‌ను ఇబ్బందులు పెట్టాల‌నే ధ్యేయంతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టాల‌ని చూసినా..రామోజీరావు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌తో డిపాజిట్లు చేసిన వారంద‌రూ..ఎటువంటి ఆందోళ‌న‌కు గురికాలేదు. ప్ర‌తిపైసాకు త‌న‌దే భ‌రోసా అని..ఎవ‌రూ కంగారు ప‌డ‌వ‌ద్ద‌న్న రామోజీ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టాల‌న్న అప్ప‌టి ప్ర‌భుత్వ ధ్యేయం నెర‌వెర‌లేదు.

తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత కూడా..

అయితే..ఈ విష‌యంలో అప్ప‌టి నుంచి ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తెలంగాణ హైకోర్టు ఈ డిపాజిట్లు విష‌యంలో మార్గ‌ద‌ర్శికి అనుకూల తీర్పు ఇచ్చినా..ఉండ‌వ‌ల్లి త‌న ఆరాటాన్ని..పోరాట‌న్ని త‌గ్గించుకోలేదు.

జగన్‌ హయాంలో సీఐడీ దర్యాప్తు

పైగా త‌న గురువు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమారుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎలాగైనా రామోజీరావును అరెస్టు చేయించాల‌నే త‌లంపుతో..ఆయ‌న‌పైకి సిఐడిని పంపించారు. తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న రామోజీరావు బెడ్‌పై ఉన్న ఫోటోల‌ను మీడియాకు లీకు చేయించి వికృతానందం పొందారు. అయితే..ఉండ‌వ‌ల్లి, జ‌గ‌న్‌లు ఎంత‌గా ఇబ్బంది పెట్టినా..రామోజీరావు..తొణ‌క‌లేదు..బెణ‌క‌లేదు.

రామోజీరావు మరణం తర్వాత కూడా ఆగని పోరాటం

2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఘోర‌ప‌రాజ‌యాన్ని త‌నివితీరా చూసిన త‌రువాత రామోజీరావు అస్త‌మించారు. అయితే..ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత కూడా ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ త‌న పోరాటాన్ని ఆప‌లేదు. సుప్రీంకోర్టులో మ‌రోసారి..దీనిపై పోరాటం చేసి..ఎదురుదెబ్బ తిన్నారు.

సుప్రీంకోర్టులో ‘అసలు మీరెవరు?’ అనే ప్రశ్న

చివ‌ర‌కు ఈ విష‌యంలో అసలు మీరెవ‌రు...మీకు సంబంధం ఏమిట‌ని సుప్రీంకోర్టులో ఉండ‌వ‌ల్లి చివాట్లు తిన్నారు. ఏ ఒక్క డిపాజిట్‌దారుడు ఫిర్యాదు చేయ‌కుండా, ఎవ‌రికీ పైసా న‌ష్టం జ‌ర‌గ‌ని విష‌యంలో ఉండ‌వ‌ల్లి చేసిన పోరాటం..న‌భూతో అన‌వ‌చ్చు.

ఇకనైనా “ఉండవల్లి” ఆరాటం ఆగుతుందా?

త‌న రాజ‌కీయ గురువుల‌కు ల‌బ్ది చేకూర్చేందుకు, ఒక కులంపై అప‌వాదులు వేసేందుకు అప‌ర‌మేధావిగా చెప్పుకునే ఉండ‌వ‌ల్లి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు త‌రువాతైనా..ఆయ‌న ఆరాటాన్ని..పోరాటాన్ని ఆపేస్తారో..లేదో చూడాలి. మ‌ళ్లీ కుక్క‌తోక వంక‌ర అన్న‌ట్లు ఈ తీర్పుకు వ‌క్ర‌భాష్యాలు చెబుతారో చూడాలి.